ఇప్పటికే బీఆర్ఎస్ ( BRS party )అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది.కాంగ్రెస్ కూడా తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.
ఆ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమవుతుండగా, బిజెపి( BJP ) కూడా ఈ విషయంలో ముందడుగు వేసింది.అసెంబ్లీ టికెట్ కోరుతున్న ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
మొదటి రోజు 182 దరఖాస్తులు రాగా, రెండో రోజు 178 దరఖాస్తులు వచ్చాయి.ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ కు గడువు ఉండడంతో, సీట్ల కోసం భారీగానే ఆశావాహులు దరఖాస్తు చేస్తారని బిజెపి అంచనా వేస్తోంది.
ఇక పార్టీకి చెందిన కీలక నేతలు సిట్టింగ్ ఎంపీలు అసెంబ్లీ టికెట్ కోసం దరఖాస్తు చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే పార్టీ అధిష్టానం కీలక నేతలందరికీ ఆదేశాలు జారీ చేసింది.

సీనియర్లు అంతా అసెంబ్లీ కి పోటీ చేయాలని సూచించింది.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) పార్టీ , జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్( Bandi Sanjay ) , సీనియర్ నేత లక్ష్మణ్, ఎంపీలు అరవింద్ , సోయం బాపూరావు , జితేందర్ రెడ్డి ,( Jithender Reddy ) కొండ విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, వివేక్ తదితరులు అసెంబ్లీ టికెట్ కోసం దరఖాస్తు చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.అయితే వీరు అసెంబ్లీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నా, ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.గతంతో పోలిస్తే ప్రస్తుతం బిజెపి గ్రాఫ్ బాగా తగ్గిందని విస్తృతంగా జనాల్లో ప్రచారం అవుతున్న నేపథ్యంలో , పార్టీ సీనియర్లంతా పోటీ చేయాలని చూస్తున్నారు.
ఒకేరోజు నామినేషన్ వేసి పార్టీకి జోష్ తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట.అయితే సీనియర్ నాయకులలో కొంతమంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీకి పోటీ చేసేందుకు అంత ఆసక్తి చూపించకపోవడంతో, ఎవరెవరు టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటారు అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో , కొన్ని కీలక నియోజకవర్గల్లో బలమైన అభ్యర్థులు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తుండడంతో , వారిని ఢీకొట్టగల సత్తా ఉన్న నాయకులు కోసమే బిజెపి వెతుకుతోంది.ప్రస్తుతం టికెట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నా, ఆ గడువు ముగిసిన తరువాత కూడా బలమైన నాయకులు పార్టీలో చేరితే వారికి టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచనలో కూడా బిజెపి ఉంది.ఏది ఏమైనా కాంగ్రెస్ , బీఆర్ఎస్ లకు దీటుగా అభ్యర్థులను ఎంపిక చేసి, వచ్చే ఎన్నికల్లో గెలుపు జెండా ఎగురవేయాలనే పట్టుదలతో తెలంగాణ బిజెపి ఉంది.







