ఖమ్మం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా ప్రకాశ్ నగర్ లోని మున్నేరు వాగు ఉధృతిని పరిశీలించారు.
అటు భద్రాచలం వద్ద మరోసారి గోదావరి నీటిమట్టం పెరగడంతో లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు అధికారులను అప్రమత్తం చేశారు.ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి పువ్వాడ అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఇప్పటికే భద్రాచలం బ్రిడ్జి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం భద్రాచలం బ్రిడ్జి వద్ద 43.5 అడుగులకు చేరింది నీటిమట్టం.అయితే ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రెండో, మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తామని పేర్కొన్నారు.
మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినా ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.ఒకవేళ వరద ఉధృతి పెరిగితే అధికారులు వెంటనే నదీ పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని వెల్లడించారు.