తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.దీంతో పలు జిల్లాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.
ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది.
గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహించింది.ఎగువ ప్రాంతంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో గోదావరికి వరద పెరిగింది.
ఈ క్రమంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం భద్రాచలం వద్ద నీటిమట్టం 44 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు గోదావరి వరద ఉధృతిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష చేసిన మంత్రి పువ్వాడ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వరద క్రమంగా తగ్గుముఖం పడుతుందని తెలిపారు.
అయితే మళ్లీ వరద పెరిగే అవకాశం ఉందన్నారు.ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం ఉన్న నేపథ్యంలో గేట్లను ఎత్తివేస్తే మళ్లీ భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతుందని వెల్లడించారు.
గతంలో గోదావరి వరదలతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి ముందుగానే అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి పువ్వాడ తెలిపారు.ఇందులో భాగంగానే లోతట్టు ప్రాంత ప్రజల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.
గతం తరహాలో కరకట్ట నుంచి భద్రాచలం నగరంలోకి నీరు రాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పువ్వాడ తెలిపారు.
అయితే తాము చెప్పిన సమయంలో అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ క్రమంలోనే పునరావాస కేంద్రాలు, హెల్త్ క్యాంపులు సిద్ధం చేశామని వెల్లడించారు.కాగా ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది.







