వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖను పరిపాలనా రాజధానిగానే భావిస్తున్నారు.విశాఖ నుంచి అన్ని కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే మూడు రాజధానుల ప్రకటనకు కట్టుబడి ఉన్నామని పదేపదే జగన్ ప్రకటిస్తున్నారు. విశాఖ( Visakhapatnam )ను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలు ను న్యాయ రాజధానిగా ప్రకటించారు.
దీని అమలుకు న్యాయపరమైన ఇబ్బందులు ఉండడంతో, అమలు సాధ్యం కావడం లేదు .అయితే అనధికారికంగానైనా, విశాఖ నుంచి పరిపాలన చేపట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన స్థలాలు, భవనాల పరిశీలన పూర్తయింది.ఇక జగన్ సైతం విశాఖలోనే మకాం వేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.

తాను ఎక్కడ ఉంటే, అక్కడ నుంచే పరిపాలన కొనసాగుతుందనే లెక్కల్లో జగన్( YS Jagan Mohan Reddy ) ఉన్నారు .తాను చెప్పిన మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనకు మాత్రమే పరిమితం కాకుండా, కార్యరూపం దాల్చే విధంగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఎన్నోసార్లు జగన్ విశాఖ నుంచి పరిపాలన చేపడతారని , అక్కడే నివాసం ఉంటారని ప్రచారం జరిగిన ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే వస్తుంది.రాజ్యసభ సభ్యుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

త్వరలోనే జగన్ విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తారని , ఇక్కడే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారని ప్రకటించారు.జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించిన సుబ్బారెడ్డి త్వరలోనే విశాఖ నుండి పాలన ప్రారంభమవుతుందని, సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభం కాబోతోందని తెలిపారు.ఆగస్టు లేదా సెప్టెంబర్ లో జగన్ విశాఖ నుంచి పాలన సాగించేందుకు ఇక్కడకు వస్తారని, న్యాయపరమైన ఇబ్బందులు ఉండడంతోనే ఆలస్యం అయిందని సుబ్బారెడ్డి ప్రకటించారు.దీంతో జగన్ విశాఖ నుంచి పరిపాలన మొదలుపెట్టి జగన్ తన పంతాన్ని నెరవేర్చుకోబోతున్నారు.







