బిజెపితో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఓడించాలనే లక్ష్యంతో టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu Naidu ) ఉన్నారు.అలాగే జనసేన పార్టీ కూడా తమతో కలిసి వస్తుంది కాబట్టి తమ విజయానికి తిరుగు ఉండదని బాబు ధీమా తో ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా( Amit Shah ) తో పొత్తుల అంశంపై చర్చించారు.అక్కడ చంద్రబాబుకు అమిత్ ఏ హామీ ఇచ్చారో తెలియదు గాని , పొత్తుల అంశంపై మాత్రం టిడిపి ధీమా గానే ఉంది.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం విపక్ష పార్టీలన్నీ ఏకమై వైసీపీని ఎదుర్కొంటామని ప్రకటనలు చేస్తున్నారు.అయితే ఈ పొత్తుల విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేస్తున్న ప్రకటనలు టిడిపికి ఆందోళన కలిగిస్తున్నాయి.
జనసేనతోనే పొత్తు కొనసాగిస్తున్నామని, టిడిపి తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటూ చెబుతూనే ఆ పార్టీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

తాజాగా తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని పారిచర్ల వారి పాలెం గ్రామంలో కేంద్ర ఐటి , సహాయ మంత్రి దేవ్ సింహ చౌహన్ తో కలిసి ఉపాధి హామీ పనులను పరిశీలించిన వీర్రాజు ఈ సందర్భంగా టీడీపీ పై విమర్శలు చేశారు.ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులతో బిజెపి అధికారంలోకి రావాలనుకోవడం లేదని, అందుకే రాష్ట్రంలో టిడిపి ( TDP )తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నట్లు వీర్రాజు తెలిపారు.జనసేనతో మాత్రమే కలిసి నడుస్తామని ఆయన అన్నారు.
గతంలో టిడిపి తో పొత్తు పెట్టుకుని ఇబ్బందులు పడిన విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేదని, కేంద్రంలోని బిజెపి పెద్దలు కూడా చంద్రబాబుతో పొత్తు విషయమై అంగీకారం తెలపలేదని వీర్రాజు అన్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో చంద్రబాబు పాలన సమయంలో ఏపీకి 35 వేల కోట్ల నిధులు ఇచ్చారని, అయితే అన్నిటిని చంద్రన్న బాట పేరుతో ఖర్చుచేసి బిజెపిపై విమర్శలు చేశారని వీర్రాజు గుర్తు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ చాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారని వీర్రాజు అన్నారు.మోది పాలన దేశానికి ఆదర్శమని చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక రాజధాని నిర్మించారని విమర్శించారు.

బాబు పాలనలో సోమవారం పోలవరం అని కాలక్షేపం చేశారని , జనసేన, టిడిపి పొత్తు విషయమై బాబే సమాధానం చెప్పాలని వీర్రాజు అన్నారు.మొత్తంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంలో బిజెపి అధిష్టానం పెద్దలు వైఖరి ఎలా ఉన్నా, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హోదాలో మాత్రం సోము వీర్రాజు ఈ పొత్తును తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు.







