ప్రజాగర్జన సభ పూర్తి స్థాయిలో విజయవంతమైందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మరోసారి తన సత్తా చాటిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు.ప్రజాగర్జన విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు.
ఈ మేరకు సోమవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు.కమ్యూనిస్టులపై అవాకులు చావాకులు పేలుతున్న వారికి ప్రజాగర్జన సభ సమాధానం ఇచ్చిందన్నారు.
బిర్యాని ప్యాకెట్లు, వందల రూపాయల పంపిణీ లేకుండా వేలాది మంది తరలి వచ్చి కమ్యూనిస్టు పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారని ఆయన తెలిపారు.ప్రజలు ఇచ్చిన ఈ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకుని ముందుకు సాగుతామన్నారు.
పాలక వర్గాలు ప్రజలను విస్మరించి పాలన సాగిస్తే తగు సమాధానం చెప్పక తప్పదన్నారు.రానున్న కాలంలో మరిన్ని ప్రజా పోరాటాలకు ప్రజల నుంచి మద్దతు కోరుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పునరంకితం అవుతామని ఆయన తెలిపారు.







