ఏపీలో బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) కేంద్ర బిజెపి పెద్దలను ప్రసన్నం చేసుకుని, బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు.
జనసేన పార్టీతో టిడిపి పొత్తు దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో, బిజెపిని కూడా కలుపుకుని వెళ్తే రాబోయే ఎన్నికల్లో తిరుగు ఉండదనే లెక్కల్లో ఉన్నారు.దీనిలో భాగంగానే కేంద్ర బిజెపి పెద్దలతో పొత్తు అంశంపై చర్చించేందుకు వెళ్లిన టిడిపి అధినేత చంద్రబాబు నిన్న రాత్రి 7:30 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు.రాత్రి 9 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit shah ) నివాసానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు, అమిత్ షా తో పాటు, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్య దాదాపు 45 నిమిషాల పాటు కీలక భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలోని రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.అలాగే కర్ణాటక ఎన్నికల ఫలితాలపైన చర్చ జరిగింది.
ఏపీలో పొత్తు అంశంపై చంద్రబాబు ప్రస్తావించడంతో పాటు, వైసీపీ ప్రభుత్వం( YCP ) పైన ఫిర్యాదు చేసినట్లు సమాచారం.అయితే ఏపీ అంశానికి పెద్దగా ప్రాధాన్యవ్వకుండా, తెలంగాణలో ముందుగా ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ అంశాల పైన అమిత్ షా చంద్రబాబును ఆరా తీశారట.
తెలంగాణలో జరగబోయే ఎన్నికలు బిజెపికి అత్యంత ప్రతిష్టాత్మక కావడం, ఇక్కడ గెలవాలంటే ప్రస్తుతం ఉన్న బలం సరిపోదనే విషయాన్ని గ్రహించిన బిజెపి పెద్దలు, అక్కడ టిడిపికి ఉన్న ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదనను చంద్రబాబు ముందు పెట్టినట్లు తెలుస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ మద్దతు తీసుకుంటే, గెలుపునకు డోఖా ఉండదనే అంచనాలో బిజెపి పెద్దలు ఉన్నారట.అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిడిపి, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది.అయితే ఆ పొత్తు కారణంగా సెంటిమెంట్ రివర్స్ అయ్యి ఓటమి చెందింది.
అయితే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అంతగా లేకపోవడం, బిఆర్ఎస్ ఏపీ లోను పార్టీ విస్తరించడంతో, బిజెపి, టిడిపి పొత్తు పెట్టుకున్నా, పెద్దగా వ్యతిరేకత ఉండదనే నిర్ణయానికి ఈ సమావేశంలో వచ్చారట.అయితే త్వరలోనే దీనికి సంబంధించిన విషయాలపై చర్చించేందుకు మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారట.

తెలంగాణలో టిడిపి, బిజెపి పొత్తు కుదిరినా టిడిపి మద్దతు బయట నుంచి తీసుకోవాలి తప్ప , అధికారికంగా టిడిపి తో పొత్తు పెట్టుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న సూచనలు బిజెపి పెద్దలకు తెలంగాణ నాయకుల నుంచి అందుతున్నాయట.ఒకవేళ తెలంగాణలో టిడిపి, బిజెపి పొత్తు అధికారికంగా కానీ, అనధికారకంగా కుదిరినా, అది అక్కడ వరకు మాత్రమే పరిమితం చేయాలని, ఏపీ లో మాత్రం టిడిపికి దూరంగా ఉండాలనే ఆలోచనలో బిజెపి పెద్దలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.







