తొమ్మిదేళ్ల అవినీతి పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది.కష్టపడి సాధించుకున్న తెలంగాణలో సుపరిపాలన కోసం మనమంతా కలిసి మంచి నిర్ణయం తీసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
ఇందుకు యావత్తు తెలంగాణ ప్రజానీకం సంసిద్ధం కావాలని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( Former MP Ponguleti )పిలుపునిచ్చారు.జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో అవతరణ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ ఎంతో మంది యోధనుయోధులు, యువకులు, కవులు, కళాకారులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఇలా అనేక వర్గాలకు చెందిన వారంతా కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మన కలలు అని కల్లాలుగానే ఈ కల్వకుంట్ల కుటుంబం మిగిల్చిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎవరికైనా లబ్ది చేకూరిందంటే అది ఒక కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమేనని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భాగస్వామ్యులైన ఉద్యమకారులకు న్యాయం చేయకపోగా వారిపై అక్రమ కేసులను బనాయించి నేటికి వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారి అడుగులకు మడుగులు ఒత్తేటోళ్లకే పెద్దపీట వేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ అవినీతి, అక్రమ పాలనకు కాలం చెల్లే రోజులు వచ్చాయన్నారు.భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ నేతలకు పరాభవం తప్పదని పొంగులేటి పేర్కొన్నారు.
అనంతరం పలువురు తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు.







