సీమాంధ్ర పెట్టుబడిదారులకు తెలంగాణ( Telangana )ను అప్పగించారని టిజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అన్నారు.జూన్ 4 వ తారీకు నుండి సూర్యాపేటలో జరిగే టిజెఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్ణాల ప్రజలు పాల్గొనగా వచ్చిన తెలంగాణను కేసీఆర్ కు అప్పగిస్తే తొమ్మిదేళ్ళ కాలంలో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు,మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలోని సహజ వనరులను పూర్తిగా దోచుకున్నారన్నారు.
సూర్యాపేట మెడికల్ కాలేజ్( Suryapet Medical College ) వరదల ప్రభావం వున్న ప్రాంతంలో నిర్మించడం వలన చిన్నపాటి వర్షానికే మునుగుతుందని అన్నారు.సూర్యాపేట పట్టణంలో సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నారని, గ్రామాలలో రోడ్లు, డ్రెయినేజీ,మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
బీఆర్ఎస్ నాయకులు గ్రానైట్,ఇసుక మాఫియా, భూ దందాలతో కోట్లకు పడగలెత్తారని విమర్శించారు.సూర్యాపేట మున్సిపాలిటీలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారో, ఎవరెవరికి వేతనాలు చెల్లిస్తున్నారో అర్దం కాని పరిస్ధితి ఏర్పడిందన్నారు.
బీఆర్ఎస్ నాయకులు( BRS Leaders ) అద్బుతమైన ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.మెయిన్ రోడ్ విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టిజేఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.







