తెలుగుదేశం పార్టీ మహానాడు ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కడియం ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు.నేడు, రేపు ఈ మహానాడు( TDP Mahanadu ) ను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా అనేక కీలక అంశాలను ప్రస్తావించి అనేక కీలక ప్రకటనలు చేయబోతున్నారు.దీంతో పాటు , జనసేన టిడిపి పొత్తు అంశం పైన టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటన చేయబోతున్నారు.
దీంతో టిడిపి మహానాడు పై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ మహానాడు వేదికగా చంద్రబాబు ఏం మాట్లాడుతారు ? పొత్తుల విషయంలో ఏ విధమైన ప్రకటన చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.ఈనెల 28వ తేదీన భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు.ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో, అనేక తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు.ప్రస్తుతం నిర్వహించబోతున్న మహానాడు ను టిడిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.అందుకే భారీగా జన సమీకరణను చేపట్టారు.
దీనికోసం అనేక కమిటీలను చంద్రబాబు( Chandrababu Naidu ) నిర్వహించారు.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం యువ గళం పాదయాత్రను వాయిదా వేసుకుని మరి ఈ మహానాడులో పాల్గొంటున్నారు.
ఈ మహానాడులో లోకేష్ యువత, నిరుద్యోగులను ఆకట్టుకునే విధంగా ప్రసంగం చేయబోతున్నారు.పూర్తిగా ఎన్నికలే టార్గెట్ గా ఈ మహానాడు వేదికను టిడిపి ఉపయోగించుకోబోతోంది.
టిడిపి మహానాడు ను గోదావరి జిల్లాలో పెట్టడానికి గల కారణం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.
గత మహానాడు ను ఒంగోలులో నిర్వహించిన టిడిపి, ఇప్పుడు రాజమండ్రి ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏమిటనే దానిపైన ఆరా తీస్తున్నారు.వాస్తవంగా తిరుపతి, విజయవాడ ,విశాఖలో ఎక్కడో ఒక చోట ఈ మహానాడు నిర్వహిస్తారని అంతా భావించినా, రాజమండ్రి ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉన్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి.ప్రస్తుతం జన సేన తో పొత్తు దాదాపు ఖాయం అవుతున్న నేపథ్యంలో జనసేనకు ఎక్కువ బలం ఉన్న గోదావరి జిల్లాల పై టిడిపి ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా( East Godavari District )లో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా , ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి.ఈ స్థానాల్లోనే జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.
గోదావరి జిల్లాలో జనసేనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడం పార్టీ క్యాడర్, అభిమానులు ఇలా అన్ని లెక్కలు వేసుకుని ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ సీట్లను జనసేన కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో, టిడిపి ఈ మహానాడు భారీగా నిర్వహించి తమకు ఏ స్థాయిలో ఈ జిల్లాల్లో బలం ఉందో నిరూపించుకుని తద్వారా జనసేన పొత్తులో భాగంగా కోరే స్థానాల్లో పేచి పెట్టకుండా ముందుగానే టిడిపి ఇక్కడ బలం నిరూపించుకోవాలనే ఆలోచన లో ఉందట. జనసేన కంటే టిడిపికే ఎక్కువ బలంగా ఉందని నిరూపించుకుని, తద్వారా ఈ జిల్లాలో వీలైనన్ని తక్కువ సీట్లు జనసేనకు ఇచ్చే విధంగా ఈ గోదావరి జిల్లాలో మహా నాడు ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జనసేన కాకినాడ, నరసాపురం ఎంపీ స్థానాలతో పాటు, ఉమ్మడి తూర్పు ,పశ్చిమగోదావరి జిల్లాలో మెజార్టీ అసెంబ్లీ స్థానాలను కోరుకుంటుంది .ఇదే విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీసులోనూ అనేక సర్వే సంస్థల ప్రతినిధులతో చర్చించి జనసేన గెలుపు అవకాశాలపై తాజాగా ఆరా తీశారు.గోదావరి జిల్లాలో టిడిపికి బలం ఎక్కువగానే ఉండడంతో ఈ జిల్లాల్లో ఎక్కువ సీట్లు జనసేన కోరకుండా ముందుగానే ఈ మహానాడు ను ఉపయోగించుకునేందుకు బాబు ముందుగానే స్కెచ్ వేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.