తమిళనాడులోని తంజావూరు( Thanjavur ) జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ప్రారంభమైంది.ఇక్కడ దేశంలోనే సరికొత్త మెటర్నల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు.
దీని ద్వారా గర్భవతులు, కొత్త తల్లులకు సహాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.ఈ ప్రత్యేక లైబ్రరీ గర్భవతులలో ఒత్తిడిని తగ్గించడానికి, అలానే తల్లి, బిడ్డ ఇద్దరి శ్రేయస్సును ప్రోత్సహించడానికి నడుం బిగించింది.

తంజావూరు మునిసిపల్ కార్పొరేషన్ సంక్షేమ అధికారి డాక్టర్ సుభాష్ గాంధీ ( Dr.Subhash Gandhi )మాట్లాడుతూ ఈ ప్రసూతి గ్రంథాలయంలో మహిళలు చదవడానికి పుస్తకాలు ఉన్నాయని అన్నారు.ఈ లైబ్రరీ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి వారి మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుందని వివరించారు.జిల్లావ్యాప్తంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇలాంటి మాతృత్వ గ్రంథాలయాలను( Motherhood libraries ) నెలకొల్పేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు.

ఇకపోతే గ్రంథాలయానికి పుస్తకాలు అందించడానికి ఆసక్తి ఉన్నవారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖను సంప్రదించవచ్చు.లైబ్రరీకి ఇప్పటికే గర్భవతులతో పాటు, కొత్తగా పిల్లలు జన్మనిచ్చిన తల్లులలో పాపులారిటీ పెరిగిపోయింది.లైబ్రరీలో ప్రస్తుతం చరిత్ర, కల్పన, సాహిత్యం, మహిళా సాధికారత, ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలతో సహా అనేక రకాల అంశాలను కవర్ చేసే 300 కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి.పుస్తక పఠనం ఆందోళనలను దూరం చేస్తుందని ఇక్కడికి వస్తున్న గర్భవతులు చెబుతున్నారు.
లైబ్రరీని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ చొరవను అభినందిస్తున్నారు.డాక్టర్ గాంధీ ఈ గ్రంథాలయం గురించి మాట్లాడుతూ.
పుస్తకాలు చదవడం వల్ల పుట్టబోయే పిల్లలలో జ్ఞాపకశక్తి, అభిజ్ఞా వికాసం పెరుగుతుందని అన్నారు.







