రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శివ కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.రాష్ర్టంలోని అన్ని శివాలయాల్లో శివరాత్రి రోజున శివకల్యాణం జరిగితే వేములవాడలో మాత్రం కామదహనం అనంతరం త్రిరాత్రి ఉత్సవాలు నిర్వహించిన తర్వాత శివ కల్యాణం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది.
ఆలయంలోని స్వామి వారి కల్యాణ మండపంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శర్మ నేతృత్వంలో అర్చకులు స్వస్తి పుణ్యహవచనంతో ఉత్సవాలు జరిపారు.
పంచగవ్య మిశ్రణము, దీక్షాధారణము, బుత్విక్ వరణము, మంటప ప్రతిష్ట, గౌరిషోడక మాతృక ప్రతిష్ట, నవగ్రహ ప్రతిష్ట, అంకురార్పణ, వాస్తు హోమం, అగ్ని ప్రతిష్టతో పాటు స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకంతో పాటు వేదపారాయణములు, పరివార దేవతార్చనలు నిర్వహించారు.
స్వామి వారి కళ్యాణం సందర్భంగా వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామ తీర్థపు మాధవి రాజు, పట్టణ కౌన్సిలర్లు అధికారికంగా పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా అభిజిత్ లగ్న సుముహుర్తమున స్వామివారి కల్యాణ మంటపంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు.
శివకల్యాణ మహోత్సవానికి తిలకించడానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు.
అలాగే ప్రత్యేకంగా చలువ పందిళ్లు, తాగు నీటి సౌకర్యంతో పాటు కల్యాణం రోజున భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు.