మెడికల్ విద్యార్థిని ప్రీతి మృతికి కారణమైన సైఫ్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నేరేడుచర్ల బిజెపి పట్టణ అధ్యక్షుడు సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం నేరేడుచర్ల పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతి నాయక్ కు బిఆర్ఎస్ ప్రభుత్వం మద్దతుగా ఉండి న్యాయం చేయాల్సింది పోయి,ఆమె మరణానికి కారణమైన సైఫ్ అనే వ్యక్తిని కాపాడుతుందన్నారు.
తెలంగాణ ఆడబిడ్డ ప్రీతి మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని మమండిపడ్డారు.గిరిజన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తన బిడ్డ భవిష్యత్తు బాగుండాలని ఉన్నత చదువులకు పంపి తనబిడ్డని మంచి డాక్టర్ ని చేసి సమాజానికి అందించాలని కోరుకుంటే, సైఫ్ అనే రౌడీ షీటర్ ర్యాగింగ్ పేరిట ప్రేమ పేరిట ప్రీతి మరణించేలా చేశారని అన్నారు.
గతంలో కూడా ఇలాగే తెలంగాణ ఆడబిడ్డల పట్ల హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే తెలంగాణలో ఆడబిడ్డలను ఇబ్బంది పెడితే గుడ్లు పీకేస్తాం చంపేస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైయ్యారని దుయ్యబట్టారు.ప్రీతి హాస్పిటల్ లో చేరి ఐదు రోజులు క్షణం క్షణం నరకం అనుభవించి చివరకు చనిపోయిన తర్వాత కూడా ఈ చేతకాని బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రీతి నాయక్ విషయంలో జరిగిన సంఘటనలు దాచిపెట్టి హంతకుడిని కాపాడుతుందని ఆరోపించారు.
ప్రీతి నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని,ప్రీతి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని వారికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ ప్రధాన కార్యదర్శి కొణతం నాగిరెడ్డి,ఉపాధ్యక్షులు ఉరిమల్ల రామమూర్తి, కోశాధికారి రాచకొండ శ్రీను,కిసాన్ మోర్చా అధ్యక్షులు తాళ్ల నరేందర్ రెడ్డి,ఉపాధ్యక్షులు తాటికొండ పరమేశ్వర్ రెడ్డి,కార్యదర్శి చింతకుంట్ల రాజేష్ రెడ్డి,బూతు అధ్యక్షులు కాల్వ సైదులు, ఎడవల్లి సైదిరెడ్డి,కడియం సతీష్,గడ్డం సతీష్ రెడ్డి, దేవిరెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.