అవును, మీరు విన్నది నిజమే.మనుషులే టెక్నాలజీని వాడుకుంటున్నపుడు దేవుడు వాడుకోవడంలో తప్పేముంది? సాధారణంగా దేవాలయాల్లో జరిగే ఉత్సావాల్లో ఏనుగులను ఉపయోగించడం అందరికీ తెలిసినదే.కొన్ని వేడుకల సమయాల్లో అంటే, ముఖ్యంగా విగ్రహాలను ఊరేగించి సమయాలలో ఏనుగులను మనవాళ్ళు వాడుతూ వుంటారు.అయితే వీటి వల్ల ఏనుగులు హింసకు గురవుతున్నాయని ఓ పక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పలు విమర్శలు చేసినప్పటికీ అది మన హిందూ సంప్రదాయంలో ఒక భాగం కనుక అనాదిగా దానినే కొనసాగిస్తూ వస్తున్నారు.

అయితే కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో “ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ దేవాలయం” ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.అవును, వారు ఓ కొత్త ప్రయోగానికి నంది పలికారు.ఆచార వ్యవహారాలు నిర్వహించేందుకు నిజమైన ఏనుగు స్థానంలో ఓ రోబోటిక్ ఏనుగును ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది.అంటే ఇది నిజమైన ఏనుగు చేయాల్సిన క్రతులన్నీ చేసేస్తోంది.ఈ ఏనుగుకు ‘ఇరింజడప్పిల్లి రామన్’ అని కూడా నామకరణం చేయడం గమనార్హం.దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా ఈ ఆదివారం ‘నదయిరుతల్’ అనే ఉత్సావాన్ని నిర్వహించి దేవుడికి అంకితం చేశారు.కాగా ఈ విషయం ఆనోటా ఈ నోటా చేరి ఆఖరికి ‘పెటా’ ఇండియా తెలిసింది.దాంతో వారు స్పందిస్తూ… “ఇలా చేయడం వలన నిజమైన ఏనుగుల పునరావాసం కల్పించడానికి, అవి స్వేచ్ఛగా అడవులలో జీవించడానికి తోడ్పడుతుంది.” అని పేర్కొంది.ఆదివారం జరిగిన ప్రారంభోత్సవం అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు రాజ్ కుమార్ నంబూద్రి మాట్లాడుతూ.“ఈ యాంత్రిక ఏనుగును స్వీకరించడం మాకు చాలా సంతోషంగా ఉంది.ఇది మన ఆచారాలు, పండుగలను క్రూరత్వం లేకుండా నిర్వహించడానికి సహాయపడుతుంది.ఇతర దేవాలయాలు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తాయని నమ్ముతున్నాం” అని అన్నారు.







