మిగతా కాలాలతో పోలిస్తే వేసవికాలంలో కూరగాయ పంటలకు తెగుళ్లు ఎక్కువగా వ్యాపించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి ఎద్దడి, పురుగులు, తెగుళ్లు పంటను ఆశిస్తాయి.
వేసవికాలంలో కూరగాయ పంటలలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా కూరగాయ పంటలైన మిరప, బెండ, టొమోటో, పొట్ల, బీర, కాకర ఇంకా పందిరి కూరగాయలను వైరస్ తెగుళ్ల బారిన పడకుండా సంరక్షించుకోవచ్చు.కూరగాయ పంటలలో ముఖ్యమైనది టొమోటో.
ఇక వేసవికాలంలో టొమోటో ధర విపరీతంగా పెరుగుతుంది.ఈ టొమోటో పంటకు మొజాయిక్ తెగులు, స్పాటేడివిల్ట్ వైరస్, ఆకు ముడత వైరస్ ఎక్కువగా వ్యాపించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

టొమోటో మొక్కలలో ఆకులు పైకి ముడుచుకుని, మందంగా ఉంటూ, ఆకుల అంచు మధ్య భాగంలో పసుపు రంగు ఉన్నట్లయితే దానిని ఆకు ముడత వైరస్ గా పరిగణించాలి.ఇవి తెల్ల దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది.ఈ వైరస్ ద్వారా మొక్క పూత రాలిపోయి, కాయలు గిడసబారతాయి.ఒక్క చిగురుస్తున్న భాగంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా ఎండిపోవడం, కాండం, కాడలు, కొమ్మల మీద చారలు ఏర్పడినట్లయితే దానిని స్పాటేడివిల్ట్ వైరస్ గా పరిగణించాలి.
ఈ వైరస్ తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.ఇక ఆకుల మీద ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగు కలిసిన మొజాయిక్ లక్షణాలు ఉండి, ఆకులపై బొబ్బలు ఏర్పడి ముడుచుకోవడం లాంటి లక్షణాలను మొజాయిక్ తెగులుగా పరిగణించాలి.
ఈ వైరస్ వల్ల పూత పూర్తిగా రాలిపోతుంది.

ఈ మొజాయిక్ వైరస్ ఎక్కువగా పందిరి కూరగాయ పంటలకు అతిగా వ్యాపిస్తుంది.ఏ మొక్కలలో అయితే ఆకుపచ్చ, లేత పసుపచ్చ రంగుతో మోజాయిక్ లక్షణాలు కనిపించి, తొలి దశలోనే మొక్కలు చనిపోతాయి.బెండలో ఆకులు పసుపు రంగులోకి మారి మధ్యభాగం పచ్చగా ఉంటే వాటికి పల్లాకు తెగులు సోకినట్టుగా పరిగణించుకోవాలి.
ఈ తెగులు వస్తే మొక్కకు కాయలు ఏర్పడవు.ఒక వేళ ముందే ఏర్పడిన కాయలు లేత పసుపు రంగులోకి మారుతాయి.
ఇక మిరపకు మొవ్వుకుళ్ళు తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెంది, మొవ్వు లేదా చిగురుభాగం ఎండి, కాండంపై నల్లటి మచ్చలు ఏర్పడి ఆకులు పండి భారీ రాలిపోతాయి.వేసవికాలంలో సరియైన క్రమంలో రసాయన, కృత్రిమ ఎరువుల ద్వారా వైరస్ లను అరికట్టినట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు.







