వాషింగ్టన్ స్టేట్ డెమొక్రాటిక్ పార్టీకి భారత సంతతికి చెందిన శాష్టి కాన్రాడ్ కొత్త అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.అంతేకాదు.అమెరికాలోని ఏ రాష్ట్ర పార్టీ చైర్‌గానైనా బాధ్యతలు అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా , తొలి భారతీయ అమెరికన్‌గా శాష్టి చరిత్ర సృష్టించారు.38 ఏళ్ల ఆమె రాజకీయ సలహాదారుగా, కింగ్ కౌంటీ డెమొక్రాటిక్ పార్టీ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.2017 నుంచి వాషింగ్టన్ స్టేట్ డెమొక్రాటిక్ పార్టీ చైర్‌గా పనిచేస్తున్న టీనా పొడ్లోడోవిస్కీ నుంచి శాష్టి బాధ్యతలు స్వీకరించారు.
2008లో అప్పటి సెనేటర్‌గా వున్న ఒబామా ప్రైమరీ క్యాంపెయిన్ కోసం శాష్టి ఫీల్డ్ ఆర్గనైజర్‌గా పనిచేశారు.అప్పటి నుంచి ఆమె మూడు అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లో కీలకపాత్ర పోషించారు.2018 నుంచి 2022 వరకు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కౌంటీ డెమొక్రాట్‌లకు అధ్యక్షురాలిగా పనిచేశారు.అక్కడ తొలిసారిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకున్న కౌంటీ పార్టీ కోసం దాదాపు 3 లక్షల డాలర్ల విరాళాలు సేకరించారు.ఆమె నాయకత్వంలో 20 ఏళ్లుగా రిపబ్లికన్ల ఆధిపత్యంలో వున్న ఆరు సిటీ కౌన్సిల్, కౌంటీ కౌన్సిల్ సీట్లలో డెమొక్రాటిక్ పార్టీ పాగా వేయగలిగింది.

ఆమెను ‘‘40 అండర్ 40’’గా అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పొలిటికల్ కన్సల్టెంట్స్ పేర్కొంది.అలాగే సీటెల్ పొలిటిక్స్‌లో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిగా సీటెల్ మెట్ మ్యాగజైన్ ప్రశంసించింది.శాష్టి ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ అఫైర్స్‌లో మాస్టర్స్, సీటెల్ యూనివర్సిటీ నుంచి హానర్స్ డిస్టింక్షన్‌లో బీఏ చేశారు.

ఇదిలావుండగా.భారత సంతతికి చెందిన పంజాబీ మహిళ హర్మీత్ ధిల్లాన్ తృటిలో రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్‌సీ)కి అధ్యక్షత వహించే అవకాశం కోల్పోయిన సంగతి తెలిసిందే.కాలిఫోర్నియాలో జరిగిన కమిటీ సమావేశంలో ప్రస్తుత ఆర్ఎన్‌సీ ఛైర్ రోన్నా మెక్‌డానియల్స్ మరోసారి ఎన్నికయ్యారు.168 మంది సభ్యులున్న ఆర్ఎన్‌సీలో మెక్‌డానియల్‌కు 111 ఓట్లు, హర్మీత్ ధిల్లాన్‌కు 51 ఓట్లు దక్కాయి.మెక్‌డానియల్స్, హర్మీత్‌తో మంచి సంబంధాలున్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎవరికీ మద్ధతు ప్రకటించకుండా తటస్థంగా వున్నారు.
.