ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో ఏపీలో బిజెపి కూడా వ్యూహాత్మకంగా రాజకీయ పావులు కదుపుతోంది.ఒంటరిగా బిజెపి ఎన్నికలకు వెళ్లినా గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుని తమ సత్తా చాటుకోవాలని చూస్తోంది.
ముఖ్యంగా లోక్ స్థానాలపై దృష్టి సారించింది .ఏపీలో కీలకమైన నియోజకవర్గాలపై దృష్టి సారించింది. దీనిలో భాగంగానే గతంలో రెండు సార్లు బిజెపి అభ్యర్థులు గెలిచిన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పై ప్రత్యేకంగా దృష్టి సారించింది.ఈ నియోజకవర్గంలో బిజెపికి గెలుపు అవకాశాలు ఉండడం , ఈ నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న క్షత్రియులు మెజార్టీ స్థాయిలో బిజెపికి అనుకూలంగా ఉండడంతో తమ ఆశ తీరుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారట.

ఇటీవల భీమవరంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి.ఈ సందర్భంగా నరసాపురం లోక్ సభ సీటు పై చర్చ జరిగిందట.ఇక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి అనే విషయం పైన చర్చ జరిగిందట.ఈ సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్ కుటుంబాలకు చెందిన వ్యక్తుల్లో ఒకరిని నరసాపురం అభ్యర్థిగా రంగంలోకి దించితే ఫలితం సానుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారట.
గతంలో కాకినాడ, నరసాపురం నుంచి కృష్ణంరాజు ఎంపీగా గెలుపొందారు.అంతేకాకుండా కృష్ణంరాజు సొంత గ్రామం మొగల్తూరు నరసాపురం నియోజకవర్గంలో ఉండడం, ఇటీవల కృష్ణంరాజు మృతి చెందిన తర్వాత ఆయన సంస్మరణ సభలను మొగల్తూరులో ఏర్పాటు చేయగా , దానికి వేల సంఖ్య అభిమానులు రావడం తో, ఈ ప్రాంతంలో ఇప్పటికీ కృష్ణంరాజు కుటుంబానికి పట్టు ఉందని బిజెపి అంచనా వేసుకుంటుంది.

అలాగే ప్రభాస్ అభిమానులు ఎక్కువగా నరసాపురం లోక్ సభ స్థానం పరిధిలో ఉండడం, ఇవన్నీ తమకు కలిసి వస్తాయని భావిస్తున్నారు.ఈ కుటుంబాల నుంచి ఎవరిని అభ్యర్థిగా రంగంలోకి దించాలనే విషయంపై తర్జనభజన పడుతున్నారట.ఈ సందర్భంగా కృష్ణంరాజు మేనల్లుడు దంతులూరి నరసింహరాజు ( నరేంద్ర ) పేరు ప్రస్తావనకు వస్తోంది.నరేంద్ర ప్రస్తుతం బిజెపిలోనే ఉన్నారు.ఆయన నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.గతంలో కృష్ణంరాజు రాజకీయాల్లో ఉన్న సమయంలో ఆయన పార్లమెంట్ కన్వీనర్ గా స్టేట్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గానూ నరేంద్ర ఉన్నారు.
దీంతో బిజెపి తరఫున నరేంద్ర రంగంలోకి దిగితే అటు ప్రభాస్ , కృష్ణంరాజు అభిమానులు, క్షత్రియ సామాజిక వర్గం అండదండలు ఇవన్నీ కలిసి వచ్చి బిజెపి విజయానికి దోహదం చేస్తాయనే లెక్కల్లో ఉన్నారట.







