తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి రాబోతున్నామనే నమ్మకంతో ఉంది కేంద్ర అధికార పార్టీ బిజెపి.గతంతో పోలిస్తే తెలంగాణలో బిజెపి బాగా బలోపేతం కావడం, కీలక నాయకులు పార్టీలో చేరడం , గ్రామస్థాయి నుంచి బిజెపికి ఆదరణ దక్కుతూ ఉండడం , బీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుండడం , ఇవన్నీ తమకు కలిసి వస్తాయని అంచనా వేస్తోంది.
అయితే ఇప్పుడు తెలంగాణలో పెద్దగా ఉనికి లేని జనసేన పార్టీ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు.దీనికి కారణం పొత్తుల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే కారణం.
రెండు రోజుల కిందట జగత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పవన్ పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడారు.తెలంగాణ అసెంబ్లీలో కనీసం పదిమంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలని, తాను కోరుకుంటున్నట్లు చెప్పారు .అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏడు నుంచి 14 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పవన్ ప్రకటించారు.దీనికోసం తమతో కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మంచి భావజాలం ఉన్న పార్టీతో పొత్తులకు సిద్ధమంటూ పవన్ వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఏపీలో బిజెపితో తాము పొత్తు కొనసాగిస్తున్నామని, బిజెపితో కలిసే ఉన్నామని, ఉంటామని కాకపోతే కొత్త వాళ్ళతో పోతాం అంటూ వ్యాఖ్యానించారు.
అలాగే పొత్తుల పై ఎన్నికలకు వారం రోజుల ముందు క్లారిటీ వస్తుందని , కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా వెళ్తామని , లేకపోతే ఒంటరిగా వెళ్తామంటూ పవన్ వ్యాఖ్యానించారు.ఇవే తెలంగాణ బిజెపి నేతలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి.

ఏపీలో బిజెపి, జనసేన పొత్తు ఉన్నా, విడివిడిగానే రెండు పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ పరోక్షంగా టిడిపి తో పొత్తు అంశాన్ని ప్రస్తావించారు.దాదాపు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయినట్లే.అయితే ఈ పొత్తు ఏపీ వరకే కాకుండా , తెలంగాణలో ముందుగా జరగబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన కలసి పోటీ చేస్తే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు దక్కాల్సిన అధికారం మళ్లీ టిఆర్ఎస్ కే వెళుతుందని టెన్షన్ తెలంగాణ బిజెపి నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇటీవలే టిడిపి అధినేత చంద్రబాబు ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు.తెలంగాణలోనూ టిడిపిని మరింత బలోపేతం చేస్తామని , ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించారు.ఇప్పుడు జనసేన కూడా టిడిపి తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టిఆర్ఎస్ కు మేలు జరుగుతుందనే భయం తెలంగాణ బిజెపి నేతల్లో మొదలయ్యాయి.







