దేశంలో చట్టాలు ఎలాంటి కట్టుదిట్టమైన ట్రాఫిక్ రూల్స్ అమలు చేసినప్పటికీ నేటితరం కుర్రాళ్ళకి మాత్రం మెదళ్ళు పనిచేయడం లేదు.బుద్ధి మోకాళ్ళలో ఉందేమో మరి గాని వారి చేష్టలతో తోటి వాహనదారులు, ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు.
రోజూ హెల్మెట్ ధరించకుండా బైక్ నడపడం వల్ల దేశంలో ఎన్ని వందల మరణాలు సంభవిస్తున్నాయో తెలియంది కాదు.దానికి తోడు మనవాళ్ళు బైక్‌పై ఇద్దరే కూర్చుంటారా? అంటే అస్సలు కాదు.ఒకేసారి ముగ్గురు లేదా నలుగురు ఎక్కి తొక్కుతూ వుంటారు.

అదే ఎక్స్ట్రా అనుకుంటే ఇపుడు చెప్పబోయే విషయం తెలిస్తే మీరు నోరు వెళ్లబెడతారు.అవును, UPలోని బరేలీలోని జాతీయ రహదారిపై ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.కొందరు అల్లరి మూకలు మూడు ద్విచక్రవాహనాలపై పోలీస్ స్టేషన్ ఎదుటే విన్యాసాలు చేస్తూ కెమెరాలకు చిక్కారు.
సదరు యువకులు వేగంగా బైకింగ్ చేయడమే కాకుండా స్టంట్స్ చేస్తూ వీడియోలు చేయడం కొసమెరుపు.మూడు బైక్‌లపై 14 మంది యువకులు ఎక్కడం ఇక్కడ విషయం.ఇందులో 6 మంది యువకులు ఓ బైక్‌పై విన్యాసాలు చేస్తూ కెమెరాలకు చిక్కారు.

దాంతో ఈ స్టంట్ కి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా వీడియో వైరల్ కావడంతో మోటార్ సైకిల్ నంబర్లను గుర్తించి పోలీసులు వెంటనే చలాన్ జారీ చేశారు.అంతేకాకుండా వారిపై క్రమశిక్షణా రాహిత్య చర్యలు కూడా తీసుకుంటున్నారు.
మరోవైపు నెటిజన్లు కూడా వారిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు పోలీసులను డిమాండ్ చేయడం గమనార్హం.ఈ క్రమంలో ఒక బైక్‌పై ఆరుగురు, మరో రెండు బైక్‌లపై ఒక్కోదానిపై నలుగురు చొప్పున ప్రయాణిస్తున్నారని, విషయం తెలిసిన వెంటనే స్పందించి మూడు బైకులను సీజ్ చేశామని ఎస్ఎస్‌పీ అఖిలేష్ వెల్లడించారు.







