బాధ్యతగల ఉద్యోగంలో వుండి.చట్టాన్ని కాపాడాల్సిందిపోయి నేరానికి పాల్పడిన భారత సంతతికి చెందిన లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారికి సింగపూర్ కోర్ట్ మూడు నెలల జైలు శిక్ష , 800 సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.
నిందితుడిని మోహన్ రాజ్ అకిలాన్ (31)గా గుర్తించారు.ఇతను చాంగి ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో నేరస్థుల నుంచి స్వాధీనం చేసుకున్న అక్రమ పొగాకు ఉత్పత్తుల్లో కొంత భాగాన్ని దొంగచాటుగా తన వద్ద దాచుకున్నట్లు విచారణలో తేలింది.
అలాగే శిక్ష విధించే సమయంలో మరొక అభియోగాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోనికి తీసుకుందని. ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక గురువారం నివేదించింది.
ఏప్రిల్ 19,2011 నుంచి ఆగస్ట్ 8, 2022 మధ్య మోహన్. సింగపూర్‌కు చెందిన సెర్టిస్ సిస్కో ఆక్సిలరీ పోలీస్ ఫోర్స్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టాన్ హ్సియావో తెలిపారు.
ఈ క్రమంలో 2021లో హెల్త్ సైన్సెస్ అథారిటీ (హెచ్ఎస్ఏ) అనుబంధ పొగాకు నియంత్రణ శాఖ (టీఆర్‌బీ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్ యూనిట్‌కు నియమించబడ్డాడు.చాంగి విమానాశ్రయం ద్వారా సింగపూర్‌లోకి ప్రవేశించే ప్రయాణికులను తనిఖీ చేసి నిషేధిత పొగాకు సంబంధిత ఉత్పత్తులను సేకరించడం ఆయన విధుల్లో ఒకటి.
అయితే 2021 జూన్, జూలైల మధ్య మోహన్.తోటి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి నుంచి 40 ప్యాక్‌ల ఈ – వేపరైజర్ పాడ్‌లు, ఏడు ఈ – వేపరైజర్‌లతో సహా 1,417 సింగపూర్ డాలర్ల విలువైన పొగాకు సంబంధిత ఉత్పత్తులను తీసుకుని దాచుకున్నాడు.
సాధారణంగా సింగపూర్ చట్టాల ప్రకారం.దొంగిలించబడిన సొత్తును స్వీకరించినందుకు గాను ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
కాగా.ఈ వారం ప్రారంభంలో దొంగతనం కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి 42 నెలల జైలు శిక్ష విధించింది సింగపూర్ కోర్ట్.జనవరి 2020లో ఖాళీగా వున్న కాలేజ్ నుంచి కాపర్ వైర్లు, కేబుల్స్ దొంగిలించినందుకు న్యాయస్థానం ఈ శిక్ష విధించింది.భారత సంతతి వ్యక్తితో పాటు ఇద్దరు విదేశీ కార్మికులు కూడా ఈ నేరంలో పాలు పంచుకున్నారు.
నిందితుడిని ఓం శక్తి తివారీగా గుర్తించారు.ఇతను తన బంగ్లాదేశ్ మిత్రులతో కలిసి ఘటన జరిగిన రోజు రాత్రి ఖాళీగా వున్న కాలేజీలోంచి కిలోల కొద్దీ ఎలక్ట్రిక్ కేబుల్స్‌ను దొంగిలించాడు.
తొలుత 994 కిలోల కేబుల్‌ను రీ సైక్లర్స్‌కు 3,976 సింగపూర్ డాలర్లకు.తర్వాత మరో 773 కిలోల కేబుల్‌ను అదే దుకాణదారుడికి మరో 3,976 సింగపూర్ డాలర్లకు విక్రయించాడు.
ఈ సొమ్ములో కొంత మొత్తాన్ని తనకు సాయం చేసిన బంగ్లాదేశ్ మిత్రులకు ఇచ్చినట్లు ఛానెల్ న్యూస్ ఏషియా తెలిపింది.
.