భారత సంతతికి చెందిన అమెరికన్ ప్రొఫెసర్ శ్రీ.కె.నాయర్‌కు జపాన్‌కు చెందిన ప్రతిష్టాత్మక ‘‘ఓకావా అవార్డ్’’ లభించింది.కంప్యూటర్ విజన్, కంప్యూటేషనల్ ఇమేజింగ్‌పై చేసిన కృషికి గాను ఆయనను ఈ అవార్డ్ వరించింది.
కొలంబియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా నాయర్ పనిచేస్తున్నారు.అలాగే కంప్యూటేషనల్ ఇమేజింగ్ అండ్ విజన్ లాబొరేటరీకి నేతృత్వం వహిస్తున్నారు.
ఇక్కడ అధునాతన కంప్యూటర్ విజన్ సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తారు.దీనిపై నాయర్ మాట్లాడుతూ… ఒకావా ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
గడిచిన మూడు దశాబ్ధాలుగా తాను జపాన్‌కు చెందిన పరిశోధకులు, కంపెనీలతో కలిసి పనిచేసినట్లు వెల్లడించారు.వచ్చే ఏడాది మార్చిలో జపాన్‌లోని టోక్యోలో జరిగే వేడుకల్లో నాయర్‌కు ఈ అవార్డ్‌ను ప్రదానం చేయనున్నారు.
ఆయనకంటే ముందు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ రాజ్ రెడ్డి, డాక్టర్ జేకే అగర్వాల్‌లు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.
కేరళలోని తిరువనంతపురానికి చెందిన నాయర్.
జార్ఖండ్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఎస్ డిగ్రీని పొందారు.అనంతరం నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ , కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో ఎంస్ చేశారు.
కార్నెగీ మెల్లన్ వర్సిటీలోని రోబోటిక్స్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ , కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు నాయర్.
డిజిటల్ ఇమేజింగ్, కంప్యూటర్ విజన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, రోబోటిక్స్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్‌ల రంగాలలో ఆయన పరిశోధనలు చేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్‌కు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ప్రతిరోజూ నాయర్ అభివృద్ధి చేసిన సాంకేతికతను ఉపయోగిస్తున్నారని అంచనా.ఆయన అందించిన సేవలకు గాను డేవిడ్ మార్ ప్రైజ్, డేవిడ్ అండ్ లూసిల్ ప్యాకర్డ్ ఫెలోషిప్, నేషనల్ యంగ్ ఇన్వెస్టిగేటర్ అవార్డ్, కార్నెగీ మెల్లన్ అలుమ్ని అచీవ్‌మెంట్ అవార్డ్, హెల్మ్ హోల్ట్జ్ ప్రైజ్ వంటి పురస్కారాలను అందుకున్నారు.