రానున్న 2023-24 వార్షిక బడ్జెట్ కు సంబంధించిన వాటాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇప్పటికే అన్ని రాష్ట్రాలతోనూ చర్చించి పూర్తి చేసేసారట.కేంద్ర బడ్జెట్ కూర్పు దాదాపు అయిపోయినట్లే అని సమాచారం.
అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ కు ఎంత ఇవ్వాలి అన్న విషయంపై ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నివేదికలు పంపించేశారు.అయితే దేశ రాజధాని నుండి వస్తున్న వార్తల ప్రకారం ఈసారి కూడా కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర రాజధాని ఊసు లేదంటున్నారు.
ప్రస్తుత వార్షిక బడ్జెట్లో అమరావతి గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. విశాఖ రైల్వే జోన్ కు కూడా ప్రత్యేక నిధులు కేటాయించలేదు.
అంతేకాకుండా విజయవాడ మెట్రో, విశాఖ మెట్రో, నర్సాపురం హైదరాబాద్ డబుల్ లైన్ పనులు వేటికి బడ్జెట్లో స్థానం దక్కలేదు.కాబట్టి వచ్చే సంవత్సరంలో అయినా వీటికి అవకాశం ఉంటుందని పలువురు భావించారు.
అయితే రాష్ట్రం నుండే కేంద్రానికి అసలు అలాంటి ప్రతిపాదనలు అందినట్లు కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం.ఇక ఇవేవీ కాకుండా భోగాపురం విమానాశ్రయం పనులకు మాత్రం బడ్జెట్ కేటాయింపు ఉండనున్నట్లు తెలుస్తోంది.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా ఎటువంటి ప్యాకేజీలు లేవు.

మొత్తానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నివేదికలు పంపించిందో తెలియదు గానీ అతికీలకమైన రాజధాని, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు రావలసిన నిధులు విషయంలో కేంద్రం బడ్జెట్ ఇవ్వకపోతే ఇక అభివృద్ధిని గాలికి వదిలేయాల్సిన పరిస్థితి.బడ్జెట్లో క్రితం సారి లాగే ఏపీ ప్రస్తావన చర్చకు వచ్చే అవకాశమే లేదు అని అంటున్నారు.అంతేకాకుండా ఈసారి కేటాయింపుల్లో భారీ కోత కూడా పడనున్నట్లు సమాచారం.
ఈ బడ్జెట్ కంటే క్రితం బడ్జెట్ మేలు అనిపించేలా కేంద్రం ఈసారి వ్యవహరించనుందట.కాబట్టి రాబోయే బడ్జెట్లో రాష్ట్ర ప్రజలు ఏమీ ఆశించకపోవడం మంచిది అని ముందే హెచ్చరిక చేస్తున్నారు పొలిటికల్ పండితులు.







