కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుకుంటున్న భారతీయ విద్యార్ధి రిషి రాజ్‌పోపట్ చరిత్ర సృష్టించాడు.2,500 సంవత్సరాలుగా ఎంతో మంది ఉద్ధండ సంస్కృత పండితులకు సైతం కొరుకుడు పడని వ్యాకరణ సమస్యను పరిష్కరించాడు.క్రీస్తుపూర్వం 5వ శతాబ్ధం నాటి సంస్కృత పండితుడు పాణిని రాసిన వచనాన్ని రిషి డీకోడ్ చేసినట్లు నివేదించింది.ఈ మేరకు ‘‘ ఇన్ పాణిని, వియ్ ట్రస్ట్ : డిస్కవరింగ్ ది అల్గోరిథమ్ ఫర్ రూల్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇన్ ద అష్టాధ్యాయి’’ పేరుతో పరిశోధనా పత్రాన్ని గురువారం ప్రచురించారు.దీనిని కంప్యూటర్‌లోనూ వినియోగించవచ్చని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పేర్కొంది.రాజ్‌పోపట్ కేంబ్రిడ్జ్‌లోని సెయింట్ జాన్స్ కాలేజీలోని ఆసియన్ అండ్ మిడిల్ ఈస్టర్న్ స్టడీస్ ఫ్యాకల్టీలో పీహెచ్‌డీ విద్యార్ధి.
ఇదిలావుండగా.క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ధంలో పాణిని సంస్కృత వ్యాకరణానికి సంబంధించి ఒక మెటారూల్‌ను రాశారు.దీని ప్రకారం .సమాన బలం కలిగిన రెండు నియమాల మధ్యన వైరుధ్యం ఏర్పడినప్పుడు, వ్యాకరణ క్రమంలో ఆ తర్వాత వచ్చే నియమమే గెలుస్తుందని శతాబ్ధాలుగా పండితులు చెబుతూ వచ్చారు.కానీ రిషి ఇది తప్పని నిరూపించారు.పాణిని రాసిన పదానికి కుడి, ఎడమ వైపు నిబంధనలు వర్తింపజేసే సమయంలో.పదానికి కుడివైపున వర్తించే నియమాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలని పాణిని చెప్పారని రిషి వివరించారు.ఈ పజిల్‌ను ఛేదించేందుకు రిషి నెలల పాటు శ్రమించారు.
గంటల తరబడి లైబ్రరీలోనే గడిపేవాడినని, చివరికి రాత్రుళ్లు కూడా అక్కడే వుండేవాడినని ఆయన తెలిపారు.

ఈ పనిలో రిషికి కేంబ్రిడ్జ్ వర్సిటీకి చెందిన వెన్సింజో వెర్జియానో మెంటార్‌గా వ్యవహరించారు.శతాబ్ధాలుగా హేమాహేమీలైన పండితుల వల్ల కాని దానిని రిషి సాధించాడని వెన్సింజో ప్రశంసించారు.మృత భాషగా మారుతున్న సంస్కృతంపై మరింత మంది ఆసక్తి చూపడానికి ఈ ఆవిష్కరణ దోహదం చేస్తుందని ఆయన ఆకాంక్షించారు.
సంస్కృతం.దక్షిణాసియాకు చెందిన ఇండో యూరోపియన్ భాష.భారతీయ పురాణాలు, శాస్త్రాలు, రచనలు అన్ని సంస్కృతంలోనే వుండేవి.అనేక మంది చక్రవర్తులు, మహారాజులు సంస్కృత భాషను, పండితులను ఆదరించారు.
అయితే కాలక్రమంలో సంస్కృత భాష అంతరిస్తూ వస్తోంది.ప్రస్తుతం దేశం మొత్తం మీద పాతిక వేల మంది మాత్రమే ఈ భాష మాట్లాడుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.







