ప్రపంచ ప్రఖ్యాత కంబోడియాలోని అంగ్‌కోర్ వాట్ ఆలయ సముదాయాన్ని భారతదేశం పునరుద్దరిస్తుందన్నారు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్.మన నాగరికత ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదని, వివిధ దేశాలకు విస్తరించిందని ఆయన పేర్కొన్నారు.
కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ… భారతదేశంలో, భారత ఉపఖండంలో, వివిధ దేశాల్లో ఎన్నో ఆలయాలు వున్నాయన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయమైన అంగ్‌కోర్ వాట్ ఆలయ సముదాయాన్ని చూడటానికి తాను ఉప రాష్ట్రపతితో కలిసి వెళ్లానని చెప్పారు.
ఇదే సమయంలో చైనాలో భారత రాయబారిగా పనిచేసిన రోజులను మంత్రి జైశంకర్ గుర్తుచేసుకున్నారు.చైనా తూర్పు తీరంలోనూ హిందూ దేవాలయాల అవశేషాలను తాను చూసినట్లు ఆయన వెల్లడించారు.
అయోధ్యకు, కొరియాకు మధ్య చాలా ప్రత్యేకమైన అనుబంధం వుందని జైశంకర్ పేర్కొన్నారు.బహ్రెయిన్‌లోని శ్రీనాథ్ జీ ఆలయాన్ని కూడా జైశంకర్ గుర్తుచేశారు.
యూఏఈలో ఇప్పటికే ఆలయాన్ని నిర్మిస్తున్నామని, బహ్రెయిన్‌లోనూ ఆలయ నిర్మాణానికి అనుమతి రావడం గర్వకారణమన్నారు.ఇప్పుడు అమెరికాలో 1000కి పైగా ఆలయాలు వున్నాయని జైశంకర్ చెప్పారు.

విదేశాల్లో 3.5 కోట్ల మంది భారతీయులు, భారత సంతతికి చెందిన వారు వున్నారని .వీరంతా భారతీయ సంస్కృతిని విదేశాలకు తీసుకెళ్లారని ఆయన ప్రశంసించారు.అందువల్ల వీరందరికి తమ ప్రభుత్వం మద్ధతుగా వుంటుందన్నారు.దీనిలో భాగంగా నేపాల్‌లో రామాయణ సర్క్యూట్‌ను నిర్మించేందుకు మోడీ రూ.200 కోట్లతో హామీ ఇచ్చారని జైశంకర్ తెలిపారు.12 ఏళ్లుగా మూతపడి వున్న శ్రీలంక మన్నార్‌లోని తిరుకేతీశ్వరం ఆలయాన్ని భారత్ పునరుద్ధరించిందని ఆయన గుర్తుచేశారు.తమ కృషి వల్లే ఆలయ పునరుద్ధరణ సాధ్యమైందన్నారు.







