ఏపీలో జనసేన పార్టీకి కాస్తో కూస్తో బలం ఉంది.ఆ బలంతోనే 2024 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బిజెపి సహకారంతో పోటీ చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది.
పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు.ఈ మేరకు ప్రచార రథం వారాహిని సిద్ధం చేసుకున్నారు.
అయితే అంతకంటే ముందుగా తెలంగాణలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధమంటూ ఇప్పటికే ప్రకటన చేసింది .ఆ పార్టీకి అక్కడ బలం లేకపోయినా , తాము పోటీలో ఉంటామంటూ ప్రకటనలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.కేవలం ప్రకటనతో సరిపెట్టకుండా దానికి సంబంధించిన కసరత్తును మొదలుపెట్టింది. తెలంగాణ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి గా శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఉదృతంగా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే 32 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్చార్జిల నియామకాన్ని పూర్తి చేసినట్లు శంకర్ గౌడ్ తెలిపారు.తెలంగాణలో పోటీకి సిద్ధంగా ఉండాలంటూ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెంచుకునేందుకు జనసేన ప్రణాళికలు రచిస్తోంది.
ప్రస్తుతం 32 నియోజకవర్గాల ఇన్చార్జీలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి జనసేన బలం ఏవిధంగా ఉంది, పార్టీలో చేరికలు తదితర అన్ని అంశాల పైన సమగ్రంగా నివేదిక రూపొందించి అధినేతకు అందించబోతున్నారు.వీటన్నిటిని అంచనా వేసి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ పోటీ చేయాలనే విషయంపై ఒక క్లారిటీకి రాబోతున్నారు.
జనసేన తరఫున అభ్యర్థులుగా పార్టీ సంస్థ గత నిర్మాణం కోసం పనిచేసే వారికి ఎక్కువగా అవకాశం ఇవ్వాలని, అలాగే పెద్ద ఎత్తున పార్టీ పదవుల నియామకం చేపట్టేందుకు జనసేన ప్రణాళికలు రచించింది.మొత్తంగా తెలంగాణ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని ఆ పార్టీ డిసైడ్ అయింది.

ఏపీతో పాటు తెలంగాణలోనూ పార్టీని మరింత బలోపేతం చేసి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన ప్రభావం ఉండే విధంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు.అయితే జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుందా లేక ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అనేది క్లారిటీ లేదు.ఏపీలో బిజెపితో పొత్తు ఉన్నా,తెలంగాణలో బిజెపి నేతలు జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు.ఈ క్రమంలో పవన్ ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారా లేక ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటారా అనేది వేచి చూడాల్సిందే.







