ప్రతి ఒక్కరికీ చిన్నప్పటి నుంచి చాలా కలలు ఉంటాయి.ఎన్నో ఆశలు ఉంటాయి.అయితే కొందరు తమ కలను సాకారం చేసుకుంటారు.మరికొందరు కలను మర్చిపోతుంటారు.అయితే కొద్ది మంది మాత్రం పట్టువిడువని విక్రమార్కుడిలా తాము కోరుకున్నది సాధించే వరకూ నిద్రపోరు.అలాంటి కోవకే చెందుతాడు ఇక్కడొక వ్యక్తి.
చిన్నప్పటి నుంచి తాను కన్న కలను వెరైటీగా తీర్చుకుని ఆనందపడ్డాడు.స్పోర్ట్స్ బైక్ కొనాలనుకునే తన కలను సాకారం చేసుకున్నాడు.
ఇప్పటి చాలా మంది యువకులకు బైక్ మీద విపరీతమైన మోజు ఉంటుంది.తాము కూడా మంచి బైక్ కొనుక్కోవాలని, అందులో హాయిగా తిరగాలని కోరుకుంటూ ఉంటారు.
తల్లిదండ్రులు కొనిచ్చిన బైక్ తో కొందరు ఆనందపడితే, తాము స్వయంగా సంపాదించిన డబ్బులతో బైక్ కొనేవారు మరికొందరు ఉంటారు.మంచిర్యాలకు చెందిన వెంకటేస్ అనే యువకుడు కూడా కేటీఎం బైక్ ను కొనాలనుకున్నాడు.మొత్తం రూ.2.85 లక్షలు విలువ చేసే ఆ బైక్ ను కొనేందుకు సిద్దపడ్డాడు.అయితే తన కలను అలా సులభంగా కాకుండా గుర్తుండిపోయేలా వెరైటీగా కొనాలని అనుకున్నాడు.
తనకు నచ్చిన బైక్ ను నాణేల ద్వారా కొనుగోలు చేయాలని అనుకున్నాడు.

అలా తాను పోగేసిన చిల్లరను ట్రాలీలో తీసుకొచ్చి షోరూం వాళ్లకు అప్పజెప్పాడు.మొత్తం 112 పాలిథీన్ కవర్లలో డబ్బులు తీసుకొచ్చి షోరూం సిబ్బందిని ఆశ్చర్యపరిచాడు.ఆన్ లైన్ గేమింగ్ యాప్ ద్వారా తాను డబ్బులు సంపాదించానని, తన డబ్బులు అనవసరంగా ఖర్చు చేయకుండా తనకు ఇష్టమైన బైక్ ను తీసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని తెలిపాడు.
అందరిలా కాకుండా కొద్దిగా వెరైటీగా ఉండాలని ఇలా నాణేలతో తనకు నచ్చిన బైక్ ను కొన్నట్లు వెంకటేస్ చెప్పుకొచ్చాడు.వెంకటేస్ తాను అనుకున్నది నెరవేర్చుకున్నాడు కానీ షోరూం సిబ్బందికి మాత్రం పెద్ద పనే అప్పజెప్పాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.







