కెనడాలో భారత సంతతి వ్యక్తులు వరుసగా హత్యలకు గురవుతున్నారు.కొద్దిరోజుల క్రితం బ్రాంప్టన్‌లో ఓ పంజాబీ యువతిని దుండగులు కాల్చిచంపిన ఘటన మరవకముందే మరో సంఘటన చోటు చేసుకుంది.
బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో తన ఇంటిలోనే ఓ 40 ఏళ్ల సిక్కు మహిళను దుండగులు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసినట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసు విభాగం (ఆర్‌సీఎంపీ) తెలిపింది.
మృతురాలిని హర్‌ప్రీత్ కౌర్‌గా గుర్తించారు.12700 బ్లాక్ 66 అవెన్యూలోని ఒక ఇంటి ముందు ఒక మహిళ తీవ్రగాయాలతో పడివున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి హర్‌ప్రీత్ భర్తను అనుమానితుడిగా తొలుత అరెస్ట్ చేశామని, తర్వాత విడుదల చేశామని తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు చెందిన సార్జంట్ తిమోతీ పియరోటీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.
కేసు మిస్టరీని ఛేదించేందుకు దర్యాప్తు అధికారులు 24 గంటలూ పనిచేస్తున్నారని చెప్పారు.ఈ తరహా సంఘటనలు బాధితురాలి కుటుంబంతో పాటు వారి స్నేహితులే కాకుండా మొత్తం సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తిమోతీ అభిప్రాయపడ్డారు.

డిసెంబర్ 3న మిస్సిసాగాలోని గ్యాస్ స్టేషన్ వెలుపల 21 ఏళ్ల పవన్ ప్రీత్ కౌర్ అనే పంజాబీ సంతతికి చెందిన యువతిని దుండగులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది.ఘటన జరిగిన రోజు రాత్రి 10.40 గంటలకు క్రెడిట్ వ్యూ రోడ్, బ్రిటానియా రోడ్ వెస్ట్‌లో వున్న పెట్రో కెనడాలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు పీల్ రీజినల్ పోలీసులు తెలిపారు.సమాచారం అందిన వెంటనే తాము అక్కడికి చేరుకున్నామని.బుల్లెట్ గాయాలతో పడివున్న పవన్‌ప్రీత్ కౌర్‌కు వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం దక్కలేదని, ఆమె ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.







