అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.
అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల క్రితం అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన డాలర్ డ్రీమ్స్‌పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది.ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.
ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.
తాజాగా ఇలాంటి కేసులోనే ఓసారి చిక్కి దేశ బహిష్కరణకు గురైనా బుద్ధి తెచ్చుకోక మరోసారి ఇదే నేరం చేశాడో భారతీయుడు.వివరాల్లోకి వెళితే… నిందితుడిని అశోక్ కుమార్ ప్రహ్లాద్‌భాయ్ పటేల్ (40)ని రెండేళ్ల క్రితం దేశం నుంచి బహిష్కరించారు.
అయినప్పటికీ బుద్ధి మార్చుకోని ఇతను మరోసారి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడు.దీంతో అశోక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం కోర్టు ముందు ప్రవేశపెట్టగా, నేరాన్ని అంగీకరించాడు.ఇందుకు గాను ఇతనికి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం వుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఏప్రిల్ 5, 2023న అశోక్‌కు కోర్ట్ శిక్ష విధించనుంది.
కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.నిందితుడు నవంబర్ 24, 2021న సెయింట్ క్రోయిక్స్‌లోని హెన్రీ ఈ రోల్‌సెన్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు.ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్‌కు వెళ్లే విమానం ఎక్కేందుకు గాను ప్రీ బోర్డింగ్ తనిఖీ నిమిత్తం యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారుల ముందు హాజరయ్యాడు.ఈ సందర్భంగా నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ను వారికి సమర్పించాడు అశోక్.
అయితే అధికారుల డేటా బేస్‌లో ఆగస్ట్ 17, 2019న కాలిఫోర్నియాలోని టెకాట్‌లో అశోక్‌ను సీబీపీ అధికారులు పట్టుకున్నట్లు తేలింది.ఈ నేరంపై అదే ఏడాది నవంబర్ 21న అశోక్ పటేల్‌ను అమెరికా అధికారులు దేశం నుంచి బహిష్కరించారు.అయినప్పటికీ తిరిగి అమెరికాకు వచ్చాడు అశోక్.దీనికి గాను ఆ దేశ న్యాయ శాఖ, హోంలాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి కానీ ముందస్తు అనుమతి తీసుకోలేదు.దీంతో అతనిని ఎయిర్‌పోర్ట్‌లోనే సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.