పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం.అటువంటి పెళ్లిని అందరూ ఎంతో వైభవంగా వేడుకగా జరుపుకోవాలని చూస్తారు.
వారి వారి ఆర్థిక పరిస్థితులనుబట్టీ పెళ్లిని వేడుకగా చేసుకుంటారు.సాధారణంగా పెళ్లిళ్లలో బంధువుల కోసం బస్సులను, కార్లను బుక్ చేసుకోవడం చేస్తుంటారు.
అయితే ఇక్కడ మాత్రం పెళ్లింటివారు తమ బంధువుల కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేయడం చర్చనీయాంశమైంది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీడియోను చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ కు చెందిన ఓ పెళ్లి జంట తమ బంధువుల కోసం వినూత్నంగా ఆలోచించింది.వరుడు, వధువు తమ బంధువులను పెళ్లికి తీసుకెళ్లడానికి విమానాన్ని బుక్ చేశారు.
బస్సులో వెళ్తున్నట్లుగానే బంధువులంతా విమానంలో పెళ్లిని చూడ్డానికి బయల్దేరారు.తమ తమ బంధువులంతా సమయానికి పెళ్లి వేదికకు చేరుకోవడానికి వధూవరులు ఈ పని చేశారు.
విమానంలో బంధువులంతా ఆడుతూ పాడుతూ తెగ ఎంజాయ్ చేశారు.విమానం చివరలో వధూవరులు కూర్చుని ఉండగా బంధువులంతా కేరింతలు కొడుతూ ఆడిపాడారు.
ఆ సందడిని అంతా వీడియో తీసి నెట్టింట పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. శ్రేయ సాహ్ అనే డిజిటర్ క్రియేటర్ ఇన్ స్టాలో ఈ పెళ్లి వీడియోను పోస్టు చేశాడు.
వీడియోను చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.కొందరు వధూవరులను ప్రశంసిస్తున్నారు.బంధువుల కోసం విమానం బుక్ చేయడం నిజంగా గ్రేట్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.పెళ్లంటే ఇలా ఉండాలి అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
మరికొందరేమో ఇలా పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు బాగా ఉండాలంటున్నారు.మొత్తానికి విమానంలో బంధువులంతా ఎంజాయ్ చేసిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.