భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రస్తుతం ప్రపంచం జేజేలు పలుకుతోంది.దీనికి మన పూర్వీకులు వేసిన బలమైన పునాదియే కారణం.
ధర్మం, న్యాయం పట్ల భారతీయులు కొన్ని నిబద్ధతలను పాటించారు.ఎంతోమంది విదేశీయులు ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేసినా భారతీయ సంస్కృతి చెక్కు చెదరక పరిఢవిల్లుతోంది.
కర్మభూమిగా, వేద భూమిగా, ఆచార సాంప్రదాయాలకు పట్టుగొమ్మగా విలసిల్లే భారతదేశం అంటే పాశ్చాత్య దేశాలకు సైతం ఎనలేని గౌరవం.అక్కడి ప్రజలు మనకట్టు బొట్టు అంటే ముచ్చటపడతారు.
ఇక దీనికి తోడు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలసవెళ్లిన భారతీయులు క్రమేణా అక్కడి సమాజంలో కలిసిపోయారు.అలాగే మన పండుగలను, సంస్కృతిని అక్కడ కూడా పాటిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక విదేశీయులు కూడా పాల్గొంటూ భారతీయత గొప్పదనాన్ని తెలుసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో భారతీయ సంస్కృతికి, ఆచార వ్యవహారాలను చూసి ముచ్చటపడిన ఓ అమెరికన్ మహిళ తన పెళ్లికి భారతీయ వధువు మాదిరిగా ముస్తాబైంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోను బియాంక లౌజాడో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
వీడియోలో వున్న యువతి పేరు హన్నా రోజర్స్.తన పెళ్లి సందర్భంగా భారతీయ వధువులాగా ఎరుపు రంగు లెహంగాను ధరించి తన హోటల్ గదిలో నుంచి బయటకు వచ్చింది .ఆమె ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని హాల్‌లో నిరీక్షిస్తోన్న బంధువులు, స్నేహితులు హన్నాను చూడగానే ఆశ్చర్యపోయారు.అనంతరం ఒక్కొక్కరిగా ఆమె వద్దకు వచ్చి ఆత్మీయంగా కౌగిలించుకుని అభినందనలు తెలియజేశారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన కాసేపటికీ ఈ వీడియో వైరల్ అయ్యింది.7.1 మిలియన్ల మంది దీనిని వీక్షించగా.పలువురు హన్నాకు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఆమె వైవాహిక జీవితం సంతోషంగా వుండాలని ఆకాంక్షిస్తున్నారు.