ప్రస్తుతం ఏపీలో అమరావతి ఉద్యమం చల్లారిపోయినట్టే అని భావిస్తుండగా , ఇది మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, టిడిపి ఆధ్వర్యంలో అమరావతి పరిసర ప్రాంత రైతులు చాలాకాలం నుంచి ఆందోళనలు నిర్వహిస్తూనే వచ్చారు.
అయినా వైసిపి ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించకపోవడం, మూడు రాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండడంతో, అమరావతి టు అరసవల్లి పేరుతో మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.ఈ యాత్రకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి.
అన్ని పార్టీలు మద్దతుతో అనేక జిల్లాల్లో ఈ మహా పాదయాత్ర కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో అక్టోబర్ 23న ఈ యాత్రకు బ్రేక్ పడింది.
హైకోర్టు ఆదేశాలు మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించగా, మహా పాదయాత్రలో అమరావతి ప్రాంత రైతుల కంటే ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉండడం, ఐడెంటి కార్డులు చాలా తక్కువ మంది వద్ద ఉండడం తో, గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే పాదయాత్రలో కొనసాగించాలని, మిగిలిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.దీనిపై హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ వేసినా, దానిని తిరస్కరించింది.
కేవలం 600 మందికి మాత్రమే ఈ పాదయాత్రకు అనుమతి ఉండడంతో, ఈ పాదయాత్రను కొనసాగించినా, పెద్దగా రెస్పాన్స్ ఉండదని భావించి యాత్రకు బ్రేకులు వేశారు.అయితే ఈ యాత్ర ఇక పూర్తిగా ముగిసినట్లేనని అంతా భావిస్తూ వచ్చారు.
దీనికి తోడు అమరావతి వ్యవహారం సుప్రీంకోర్టు లో పెండింగ్ లో ఉండడంతో దీనిపై తీర్పు వచ్చిన తర్వాత పాదయాత్ర కొనసాగించాలా విరమించుకోవాలనేది క్లారిటీ వస్తుందని అంతా భావిస్తుండగా, మహా పాదయాత్రను ఈ నెల 28 నుంచి మొదలు పెట్టబోతున్నట్లు అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.

ఈ మహా పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే తిరిగి మొదలు పెడతామని చెప్పారు.దీంతో మహా పాదయాత్ర ప్రారంభమైతే పాదయాత్రలో గుర్తింపు కార్డులు ఉన్న వారందరికీ రక్షణ కల్పించి యాత్రను సజావుగా ముందుకు సాగేలా చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ప్రభుత్వం పైన పడబోతోంది.







