ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక తనకు లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు.అయితే, తన సొంత రాష్ట్రం బీహార్‌కు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నానట్లుగా వివరించారు.
ప్రస్తుతం ‘జానా సూరజ్’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న ఆయన శనివారం చంపారన్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.మీరు ఎన్నికల రాజకీయాల్లోకి వస్తారా అని విలేకరులు పదే పదే ప్రశ్నించగా, పీకే బదులిస్తూ, “నేను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తాను? నాకు అలాంటి ఆశలు లేవన్నారు.అలాగే ‘రాజకీయ చతురత తక్కువ ఉన్న వ్యాపారవేత్త’ అని జేడీయూ అభివర్ణించడంపై ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు.
నేనే అలాంటి వాడిన అయితే నితీష్ కుమార్ నన్ను రెండేళ్లపాటు తన నివాసంలో ఎందుకు ఉంచుకున్నారని మీరు అడగాలంటూ విలేఖర్లను ప్రశ్నించారు.
ఈ సదస్సులో ప్రసంగిస్తూ బీహార్‌లోని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాఘటబంధన్ ప్రభుత్వంపైనా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పైనా ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. బీహార్ ప్రజలు నిర్ణయిస్తే రానున్న ఎన్నికల్లో ఎన్డీయే, మహాఘటబంధన్ రెండూ రాష్ట్రం నుంచి గల్లంతవుతాయని ఆయన అన్నారు.
పశ్చిమ చంపారన్‌లోని 18 బ్లాకుల నుండి కన్వెన్షన్‌లో పాల్గొన్న 2,887 మందిలో, 2808 మంది ప్రశాంత్ కిషోర్ తన స్వంత రాజకీయ పార్టీని స్థాపించడానికి అనుకూలంగా ఓటు వేశారు.

కాగా, ప్రశాంత్ కిషోర్ మరియు అతని బృందం ‘జన్ సూరజ్’ని రాజకీయ పార్టీగా మార్చాలా వద్దా అనే దానిపై ప్రజల నుండి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.ఆదివారం పశ్చిమ చంపారన్ జిల్లాలో ఈ కార్యక్రమం కొనసాగనుంది.తర్వాత ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తామని చెప్పారు.
ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ భవిష్యత్తు గురించి అస్పష్టంగా ఉన్నారని లేదా తన రాజకీయ ప్రత్యర్థులను గందరగోళానికి గురిచేయడానికి ఇలా నాన్చుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.