మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు జరగనుంది.ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నేలకొంది.
ఓటర్ నాడీ ఏ విధంగా ఉంది అనే విషయంలో అన్ని పార్టీలు టెన్షన్ పడుతున్నాయి.ఇప్పటికే ఓటర్లకు నగదు, చీరల పంపిణీ వంటివి ప్రధాన పార్టీలు చేపట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది భారీగానే ఓటర్లకు ఆయా పార్టీలు సొమ్మును పంపిణీ చేశాయి.
ఇదిలా ఉంటే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి మునుగోడు కు బయలుదేరగా, పోలీసులు అనేక ప్రాంతాల్లో ఆయనను అడ్డుకున్నారు.మునుగోడుకు వెళ్లేందుకు సంజయ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
బిజెపి కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.చివరగా కార్యకర్తల సహకారంతో సంజయ్ కాన్వాయ్ ముందుకు వెళ్ళింది.
ఆ తరువాత అబ్దుల్లాపూర్మెట్ వద్ద జాతీయ రహదారిపై తమ వాహనాలను ఉంచి పోలీసులు సంజయ్ కాన్వాయ్ ను ఆపారు.దీంతో బిజెపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు ఈ కారణంగా నిలిచిపోయాయి.అనంతరం పోలీసులు సంజయ్ ను అదుపులోకి తీసుకుని అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మునుగోడుకు వెళ్లకుండా తమను అడ్డుకోవడంపై బండి సంజయ్ పోలీసులు తీరుపై మండిపడ్డారు.

మునుగోడు నియోజకవర్గం టిఆర్ఎస్ కు చెందిన కీలక నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో నే మకాం వేసినా.ఎన్నికల కమిషన్ పట్టించుకోవడంలేదని, తమను మాత్రమే ఈ విధంగా నిలిపివేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ పైన సంజయ్ విమర్శలు చేశారు.
ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా.బిజెపి విజయాన్ని ఆపలేరని మునుగోడులో బిజెపి జెండానే ఎగురుతుందని , సంజయ్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారం ఇలా ఉంటే మునుగోడులో నేడు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.అదనపు బలగాలను రంగంలోకి దించారు.
ఈ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు.వివిధ రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.







