భారత రాజ్యాంగం ప్రజలకు ప్రాధమిక హక్కులను కల్పించింది.ప్రజల సంక్షేమం కోణంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు అయినా చేపట్టవచ్చని పేర్కొంది.
సంపద ఒకే దగ్గర పోగు కాకుండా , పంపిణీకి అన్ని చర్యలూ చేపట్టాలని కూడా రాజ్యాంగం దిశా నిర్ధేశమ్ చేసింది .రాజ్యాంగం ప్రాధమిక హక్కులను అమలు చేయకపోతే ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న అంశాలను అమలు చేయడం ప్రభుత్వాల నైతిక బాధ్యత .సమాజంలో ప్రజల మధ్య ఆర్ధిక అంతరాలను తగ్గించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగమే చెప్పింది.మనుషుల మధ్య వివక్ష ఏ రూపంలోనూ చూపించ కూడదని కూడా ఆదేశించింది.
ప్రజా సంక్షేమంపై రాజకీయ నీడ పడడంతో స్వాతంత్ర భారతావనిలో అభాగ్యులకు అన్యాయమే జరుగుతుంది.ఈ రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా అనేక చట్టాలు అమలులోకి వచ్చాయి.
జీవో లకు అనుగుణంగా మార్గదర్శకాలు కూడా ఆయా రాష్ట్రాలు తయారు చేశాయి.ప్రభుత్వం చట్టాలను, హక్కులను అమలు చేయని సందర్భాలలో ప్రజలు కోర్టుకు వెళ్లినప్పుడు , సుప్రీం కోర్టు కూడా అనేక తీర్పులతో ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసింది.
కానీ ప్రభుత్వాలకు ఇవేవీ పట్టడం లేదు .ప్రజల సంక్షేమం తమ బాధ్యత అని మర్చిపోయాయి.చట్టాలు, జీవో లు, మార్గదర్శకాల రూపకల్పన విషయంలో అత్యంత అమానవీయంగా,నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పేదల సంక్షేమానికి అవాంతరాలు ఎదురవుంటున్నాయి.ముఖ్యంగా పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పాతకాలంటే మరింత చులకన భావం కూడా ఉంటుంది.
ఈ మార్గదర్శకాలను అమలు చేయకపోయినా , ఎన్నికలలో లేదా బయటా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా ఏమీ కాదు అనే ధీమా కూడా ప్రభుత్వాలలో పెరిగిపోయింది.దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ ల పథకం.
తెలంగాణా ప్రభుత్వం సామాజిక బధ్రత క్రింద ఆసరా పెన్షన్ లను ఇవ్వడానికి వీలుగా 2014 నవంబర్ 5 న పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జీవో నంబర్ 17 జారీ చేసింది.

ఈ జీవో ప్రకారం వృద్ధులకు ,వితంతువులకు, చేనేత కార్మికులకు ,గీత కార్మికులకు,హెచ్‌ఐవి వ్యాధి గ్రస్తులకు 1000 రూపాయల చొప్పున , వికలాంగులకు 1500 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తామని ప్రకటించారు.ఒంటరి స్త్రీలు , బీడీ కార్మికులు , బోదకాలు బాధితులు కూడా ఆసరా పెన్షన్ కు 1000/ అర్హులేనని తరువాత జీవోలు విడుదల చేశారు.తరువాత కాలంలో పెన్షన్ మొత్తాన్ని 2016 రూపాయలకు వికలాంగులకు 3016 రూపాయలు పెంచుతూ 2019 మే 28 న జీవో నంబర్ వృద్ధప్య పెన్షన్ కు 65 సంవత్సరాల వయో పరిమితిని 57 సంవత్సరాలకు తగ్గిస్తూ 2021 ఆగస్ట్ 4 న జీవో నంబర్ 36 ను జారీ చేసింది .నిజానికి వయో పరిమితి తగ్గింపు, పెన్షన్ మొత్తం పెంపు అనేది 2018 ఎన్నికల హామీలుగా తెరాస పార్టీ ఇచ్చింది.ఎన్నికలలో విజయం సాధించింది.
కానీ చాలా ఆలస్యంగా జీవో లు విడుదల చేసింది.పైగా 2018 ఆగస్ట్ నుండీ 2022 జులై వరకూ కొత్త పెన్షన్ లను మంజూరు చేయలేదు.
పెన్షన్ మొత్తాలను అంద చేయలేదు .దీని ప్రకారం 48 నెలల పాటు ( జీవో ప్రకారం చూసినా కనీసం 38 నెలల పాటు ) ప్రతి నెలా 2016 రూపాయల చొప్పున లబ్ధిదారులు పెన్షన్ అందక నష్ట పోయారు.

ఒక్కో వ్యక్తీ నష్ట పోయిన మొత్తం 96768 రూపాయలు.అనేక ఆందోళనల తరువాత 2022 ఆగస్ట్ నుండీ అమలయ్యే విధంగా కొత్త పెన్షన్ లను అంద చేస్తున్నారు.నిజానికి ఎన్నికల హామీ ప్రకారం , లేదా కనీసం జీవో విడుదల అయినప్పటి నుండీ పెన్షన్ బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.పెన్షన్ బకాయిలను ఎగ్గొట్టడం అనేది అనైతికం , చట్ట విరుద్ధం.2015 జీవో లో పెన్షన్ పొందేందుకు కొన్ని అర్హతలు నిర్దేశించారు.దీని ప్రకారం 1.మూడున్నర ఎకరాలకంటే మాగాణి , 7.5 ఎకరాలకంటే మెట్ట భూములు ఉన్న రైతులు 2.ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగులు, ఔట్ సోర్స్ , కాంట్రాక్ట్ ఉద్యోగులు 3.పిల్లలు డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తులు , స్వయం ఉపాధి ఏర్పరుచుకుని ఉంటే 4.ఆయిల్ మిల్లు, రైస్ మిల్లు, పెట్రోల్ పంప్ ఓనర్లు.రిగ్గు ఓనర్లు, దుకాణాల యజమానులు 5.స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్ లేదా ఏదో ఒక ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు 6.నాలుగు చక్రాల లేదా అంత కంటే పెద్ద వాహనాలు ( లైట్ లేదా హెవీ) ఉన్న వారు 7.

పెన్షన్ దరఖాస్తు పరిశీలనకు అధికారులు ఇంటికి వచ్చి చూసినప్పుడు ఆ కుటుంబ సభ్యుల లైఫ్ స్టైల్ , ఇంట్లో ఉండే వస్తువులు స్థితిని బట్టి కూడా పెన్షన్ పొందేందుకు అనర్హులవుతారు.పెన్షన్ లు మాత్రమే ఎప్పుడూ ప్రజల కడుపు నింపవు.కానీ ఆ పెన్షన్ లను కూడా ఎగ్గొట్టడానికి తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను అడ్డు పెట్టుకుంటున్నది .2022 ఆగస్ట్ నుండీ కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్ లు ఇస్తున్నామని అట్టహాసంగా ప్రకటించుకున్న రాష్ట్ర ప్రభుత్వం, వారిని అర్హులుగా గుర్తిస్తూ కొత్త పెన్షన్ కార్డులను కూడా జారీ చేసింది .కానీ కొంతమంది లబ్ధిదారుల కడుపులో మట్టి కొడుతూ, వారు పెన్షన్ కు అనర్హులని చెప్పి కార్డులను రద్ధు చేస్తున్నది.మరీ ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్ ఎగ్గొట్టడానికి , నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండడం ఒక కారణమయితే, ఏడున్నర ఎకరాల కంటే మెట్ట భూమి కొద్దిగా ఎక్కువ ఉండడం మరో కారణం .ఇంట్లో అమ్మాయికి ప్రైవేట్ ఉద్యోగం ఉండడం ఇంకో కారణంగా పేర్కొన్నారు.నిజంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించే వారికి ఎవరికైనా ఇవి ఎంత అర్థం లేని కారణాలో ఇట్టే అర్థమైపోతాయి.







