మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు.తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఎంతగానో ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు.అయితే ఆయన సోదరుడు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు.
ఆయన బిజెపిలోకి వెళ్తారనే ప్రచారం జరిగినా. తన తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ లోనే ఉంటాను అంటూ వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.
బిజెపి నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండడంతో, ఆయనకు వ్యతిరేకంగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తారా లేదా అనేది అందరికీ అనుమానంగానే ఉంటూ వచ్చింది.
అయితే దానికి తగ్గట్లుగానే వెంకటరెడ్డి మునుగోడు ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు అంత ఆసక్తి చూపించలేదు.
అసలు ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.అంతకు ముందే కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణారెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇప్పించుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించారు.
అయితే వెంకటరెడ్డి మాత్రం పాల్వాయి స్రవంతికి టికెట్ ఇవ్వాలని, అప్పుడే తాను ఎన్నికల ప్రచారానికి వెళ్తానంటూ షరతులు విధించడంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం వెంకట్ రెడ్డి మాటకి ప్రాధాన్యం ఇచ్చింది. అయితే తాను కోరిన వ్యక్తికే మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో, వెంకటరెడ్డి యాక్టివ్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని అంత భావించినా ఆయన మాత్రం ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉంటూ వస్తున్నారు.

ఇక ఈరోజు ఆయన ఆస్ట్రేలియాకు కుటుంబ సమేతంగా వెళుతున్నారు.మళ్ళీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు.కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ హోదాలో ఉన్న వెంకట్ రెడ్డి కీలకమైన ఎన్నికల సమయంలో ఈ విధంగా విదేశాలకు వెళుతూ ఉండడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.పార్టీ సీనియర్ నాయకుడుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి మొదటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో అంత సఖ్యత లేదు.
ఒకరిపై ఒకరు పరోక్షంగా ఎప్పుడూ విమర్శలు చేసుకుంటూ ఉంటారు.అయితే ఇప్పుడు ఈ విధంగా ఉప ఎన్నికల సమయంలో ప్రచారానికి దూరంగా ఉంటూ విదేశాలకు వెళ్ళిపోతుండడం హాట్ టాపిక్ గా మారింది.