కరోనా వైరస్ సృష్టించిన కల్లోల పరిస్ధితుల ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పట్లో కోలుకునే దారి కనిపించడం లేదు.లక్షలాది మంది ప్రాణాలు తీయడంతో పాటు ఆర్ధిక వ్యవస్థను నష్టాల ఊబిలో ముంచింది ఈ మహమ్మారి.
కోట్లాది మంది ఉద్యోగాలు పోయి రోడ్డునపడటంతో.లెక్కకు మిక్కిలి కుటుంబాలు ఆకలి కేకలతో అల్లాడుతున్నాయి.
అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.ఉద్యోగాలు పోయి జనం ఏడుస్తుంటే.
ఇంకోవైపు ఉద్యోగుల కొరతతో కొన్ని దేశాలు అల్లాడుతున్నాయి.ఇందులో కెనడాది మొదటిస్థానంగా చెప్పుకోవచ్చు.
ఆ దేశ అధికారిక గణాంకాల ప్రకారం.ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో 9,12,600 ఉద్యోగాలు ఖాళీగా వున్నాయట.
కరోనా కారణంగానే కెనడాలో ఈ పరిస్ధితి ఎదురైనట్లుగా తెలుస్తోంది. హెల్త్ కేర్, కన్‌స్ట్రక్షన్, అకామిడేషన్ అండ్ ఫుడ్, రిటేల్ ట్రేడ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఖాళీలు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధి కోసం కెనడా ప్రభుత్వం భారీ స్థాయిలో ఇమ్మిగ్రేషన్ విధానాలను సడలిస్తూ వస్తోంది.దీనిలో భాగంగా ఇప్పటికే దేశంలో స్థిరపడిన విదేశీయులకు కెనడా పౌరసత్వం ఇవ్వాలని జస్టిన్ ట్రూడో సర్కార్ నిర్ణయించింది.
2022- 23 ఆర్ధిక సంవత్సరంలో 3,00,000 మందికి దేశ పౌరసత్వం ఇవ్వాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది.ఇది కార్యరూపం దాల్చితే అత్యధికంగా లబ్ధి పొందేది భారతీయులే.మార్చి 31, 2023 నాటికి 3,00,000 మంది విదేశీయులకు పౌరసత్వం ఇచ్చే అంశంపై ప్రాసెస్ చేయాలని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజిస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) సిఫారసు చేసింది.18 ఏళ్ల లోపున్న యువతీ యువకులు ఈ ఏడాది చివరి నాటికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఐఆర్‌సీసీ తెలిపింది.మార్చి 2020లో కోవిడ్ 19 కారణంగా ఐఆర్‌సీసీ దరఖాస్తులను ప్రాసెస్ చేయలేకపోయింది.

ఇదిలావుండగా… ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్, సిటిజెన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) గణాంకాల ప్రకారం.కెనడాలో 6,22,000 మంది విదేశీ విద్యార్ధులు వున్నారు.వీరిలో డిసెంబర్ 31, 2021 నాటికి 2,17,410 మంది భారతీయులు వున్నారు.బెంగళూరుకు చెందిన రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటజీ నివేదిక ప్రకారం.2021లో 2,17,410 మంది భారతీయ విద్యార్ధులు కెనడాలో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.2021లో దాదాపు 1,00,000 మంది భారతీయులు కెనడాలో శాశ్వత నివాస హోదా పొందారు.2021-22 మధ్యకాలంలో .2,10,000 మంది శాశ్వత నివాసులకు కెనడా పౌరసత్వం కూడా లభించినట్లు నివేదిక వెల్లడించింది.







