సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.సినిమాల్లో బిజీగా ఉంటున్నారు.
గతంలో టిడిపి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించినా, ఆ తర్వాత పూర్తిగా రాజకీయ అంశాలపై స్పందించడం లేదు.చాలాకాలంగా జూనియర్ ఎన్టీఆర్ టిడిపిలో కీలకమవుతారని, పార్టీ బాధ్యతలు నిర్వహిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, ఆయన మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు.
ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని , తన ఆలోచన అంతా సినిమా రంగంపైనే ఉందని తన సన్నిహితుల వద్ద అనేక సందర్భాల్లో జూనియర్ ప్రస్తావించారు.
అయినా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఏదో ఒక విషయం రాజకీయాల్లో ప్రస్తావనకు వస్తునే ఉంది.
ముఖ్యంగా టిడిపి పైన, చంద్రబాబు కుటుంబం పైన ఎవరు విమర్శలు చేసిన జూనియర్ ఎన్టీఆర్ స్పందించాల్సిందే అంటూ టిడిపి శ్రేణులు డిమాండ్ చేయడం , జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే పెద్ద ఎత్తున విమర్శలు చేయడం వంటివి సర్వసాధారణంగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై టిడిపి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలంటూ డిమాండ్ వినిపించడంతో దీనిపై ఎన్టీఆర్ వీడియో సందేశాన్ని వినిపించారు.

ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ గొప్ప వ్యక్తులేనని, ఎన్టీఆర్ పేరును తొలగించడం ద్వారా ఆయన ఖ్యాతి తగ్గదని, అలాగే వైఎస్సార్ పేరును చేర్చడం వల్ల అదనంగా ఏమీ ప్రయోజనం లేదని, ఇద్దరూ గొప్ప వ్యక్తులే అంటూ ఎన్టీఆర్ బ్యాలెన్స్ గా మాట్లాడారు.దీనిపైనా పెద్ద ఎత్తునే విమర్శలు వ్యక్తం అయ్యాయి.ఇక ఇప్పుడు అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ.
టిడిపి ఆధ్వర్యంలో అమరావతి ప్రాంత రైతులు , మహిళలు మహా పాదయాత్ర చేపట్టారు.ఈ యాత్రలో పాల్గొన్న ఓ మహిళ జూనియర్ ఎన్టీఆర్ పై ఆవేశంతో ఊగిపోతూ అనేక విమర్శలు చేశారు.
అసలు జూనియర్ ఎన్టీఆర్.ఎన్టీఆర్ మనవడేనా ? మనవడే అయితే అమరావతి ఉద్యమంలో పాల్గొనాలని, తమకు మద్దతు ఇవ్వాల్సిందేనంటే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఆ వీడియోను టిడిపికి చెందిన వ్యక్తులు సోషల్ మీడియా లో హైలెట్ చేయడంతో, ఎన్టీఆర్ పై టిడిపి శ్రేణులు విమర్శలు మొదలుపెట్టారు అయితే దీనికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.ఎన్టీఆర్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని టిడిపిని విమర్శిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
ఎన్టీఆర్ రాజకీయాలతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని, అనవసరంగా ఆయనను వివాదాల్లోకి లాగి ఆయన ను అభాసుపాలు చేయాలని చూస్తే అభిమానులుగా తాము టిడిపికి తగిన బుద్ధి చెబుతామంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ తెలుగు దేశం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
పూర్తిగా సినిమాలకే తన సమయాన్ని కేటాయించి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ ను అనవసర వివాదాల్లోకి లాగితే ప్రస్తుతం టీడీపీకి అండగా నిలబడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ పార్టీకి దూరమై… మరింత నష్టం చేకూర్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టిడిపికి దూరమైతే జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది అనే విషయమూ చంద్రబాబు కు బాగా తెలుసు.







