జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే , మరోపక్క ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తూ రెండిటిని బ్యాలెన్స్ చేసి ప్రయత్నం చేస్తున్నారు.అయితే పూర్తిస్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయించలేని పరిస్థితి పవన్ కు ఉంది.
అసలు రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆయన సినీ హీరోగా కొనసాగుతుండడంతో పాటు, ఆర్థికంగానూ పార్టీకి అవసరమైన నిధులను ఏర్పాటు చేసేందుకు పవన్ తప్పనిసరిగా సినిమాల్లో కొనసాగుతున్నారు. అయితే ఈ సినిమా షెడ్యూల్ బిజీ కారణంగా పూర్తిస్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయించలేకపోవడం, ఆ ప్రభావం జనసేన పై తీవ్రంగా కనిపిస్తోంది.
పవన్ కు ఉన్నంత ఫాలోయింగ్ మరే సినీ హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే పవన్ జనసేన తరఫున క్షేత్రస్థాయిలో పోరాటం చేయకపోయినా, పవన్ పిలుపు మేరకు జనసైనికులు ఆ కార్యక్రమాలను సక్సెస్ చేస్తూ ఉంటారు.
కానీ ఈ తరహా రాజకీయం ఎన్నికలను ఎదుర్కోవడానికి సరిపోదనే అభిప్రాయాలు జనసేన నాయకుల నుంచే వినిపిస్తున్నాయి.పార్టీ తరఫున పోరాటాలు, ప్రచారాలు ఏ స్థాయిలో చేసినా, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కాకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే హెచ్చరికలు పవన్ కు అందుతున్నాయి.
ఎన్నికలకు ఇంకా 18 నెలలు మాత్రమే సమయం ఉంది.కానీ చాలా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టు గా ఉంది.నియోజకవర్గల్లో బలమైన నేతలు పెద్దగా కనిపించకపోవడం , పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పనిచేసుకుంటూ, నియోజకవర్గంలో పట్టు సాధించుకునేందుకు ఎవరికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వంటివే కాకుండా, పార్టీలో కొంతమంది నాయకులు సొంతంగా ఎదిగేందుకు అవకాశం లేకుండా చేయడం వంటివి ఆ పార్టీకి ఇబ్బందులు తీసుకొస్తున్నాయి.

పార్టీ తరఫున ఏ ప్రకటనైనా, ఏ కార్యక్రమమైనా పవన్ కళ్యాణ్ లేకపోతే ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ మాత్రమే చూస్తున్నారు.ఇతర నాయకులకు అంతగా అవకాశాలు దక్కకపోవడం వంటివి జనసేనకు ఇబ్బందులే తీసుకొస్తున్నాయి.జనసేన తరపున స్వతంత్రంగా వాయిస్ వినిపించేందుకు పెద్దగా ఎవరికి అవకాశం దక్కకపోవడం, పవన్ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కొద్ది రోజుల హడావుడి జరిగినా తరువాత ఆ కార్యక్రమం నిలిచిపోవడం వంటి ఘటనలు అనేకం ఇప్పటికే చోటు చేసుకున్నాయి.
గతంతో పోలిస్తే జనసేన బాగా బలపడింది దీనిని ఎవరూ కాదనలేరు.ప్రధాన పార్టీలకు సవాల్ విసిరే స్థాయికి వెళ్ళింది.కానీ ఇంకా చాలా జిల్లాల్లో పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టు గా ఉంది పార్టీని ఎన్నికల నాటికి బలోపేతం చేయాలంటే పవన్ ఇప్పటి నుంచే రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెట్టి జనసేన తరఫున యాక్టివ్ గా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తేనే జనసైనికులో ఉత్సాహం పెరుగుతుందని, పవన్ ఈ విషయంలో సీరియస్ గా దృష్టి పెట్టాలనే అభిప్రాయాలు ఇప్పుడు సొంత పార్టీ నాయకులు, పవన్ అభిమానుల నుంచే వ్యక్తం అవుతున్నాయి.







