అగ్ర రాజ్యం అమెరికాకు ఎంతో ముఖ్యమైన రాష్గ్రం న్యూయార్క్.అమెరికాకు ఆర్ధిక రాజధానిగా పేరొందిన న్యూయార్క్ నగరంలో ప్రపంచ ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ వద్ద తానా బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసింది.
తెలంగాణా వాసులు అందరూ గర్వించేలా, తెలంగాణా సంస్కృతి ఉట్టిపడేలా కన్నుల పండువగా టైమ్ స్క్వేర్ వద్ద బతుకమ్మను నిర్వహించారు.రకరకాల పూలతో సుమారు 20 అడుగుల ఎత్తులో నిర్మించుకున్న బతుకమ్మ స్థానికంగా అందరిని ఆకట్టుకుంది.
తెలంగాణ వాసులు ఏ పద్దతిలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తారో అదే స్థాయిలో అందుకు తగ్గకుండా దేశం కాని దేశంలో బతుకమ్మ పండుగకు సుమారు నెల రోజుల ముందు నుంచే సర్వం సిద్దం చేసుకున్నారు తానా సభ్యులు.
తానా నిర్వహించిన ఈ వేడుకలకు అమెరికాలోని న్యూజెర్సీ, అట్లాంటా, వంటి పలు రాష్ట్రాల నుంచీ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి.
వివిధ ప్రాంతాల నుంచీ వచ్చిన వారికోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి న్యూయార్క్ టైమ్ స్క్వేర్ కు తరలించారు.మహిళలు పెద్ద ఎత్తున హాజరవడంతో అందులోనూ సాంప్రదాయ పద్దతిలో చీర, నగలను ధరించి రావడంతో టైమ్ స్క్వేర్ ప్రాంతం మొత్తం కళకళలాడిపోయింది.
స్థానిక అమెరికన్స్ ఈ పండుగను చూడడానికి ఎంతో ఆసక్తిని చూపించారు.

ఈ వేడుకలకు హాజరయిన మహిళలు అందరూ బతుకమ్మ చుట్టూ చేరి సంప్రదాయ పాటలు, నృత్యాలు చేయడం అక్కడ ఉన్నవారిని ఎంతో ఆకర్షించింది.ఈ వేడుకలను న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ అతిధిగా విచ్చేశారు.బతుకమ్మ ని ఉద్దేశించి మాట్లాడిన మేయర్ బతుకమ్మ పండుగ ఎంతో ఆసక్తిగా ఉందని అమెరికాలో అన్ని సంస్కృతులకు చెందిన ప్రజలు ఉంటారని, ఎవరినైనా సరే ఆదరించగల గొప్ప మనసు తమకు ఉందని ఎవరి సంప్రదాయలకు తగ్గట్టుగా ఇక్కడ వేడుకలు జరుపుకోవచ్చునని ఎరిక్ తెలిపారు.
ఈ వేడుకలకు మరొక ఆకర్షణగా సింగర్ మంగ్లీ పాడిన పాటలు యాంకర్ అనసూయ వ్యాఖ్యానం ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలాఉంటే వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి ముఖ్య కారణమైన తెలుగు కుటుంబాలకు తానా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.







