యాదాద్రి జిల్లా:ఓ వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా పండంటి బిడ్డ లోకాన్ని చూడకముందే కళ్ళు మూసిందని బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగిన ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శుక్రవారం జరిగింది.బాధితుల కథనం ప్రకారం చౌటుప్పల్ పట్టణానికి చెందిన బోయిని జ్యోతి గర్భ నిర్దారణ అయినప్పటి నుంచి పట్టణ కేంద్రంలోని ప్రియాంక ఆసుపత్రి డాక్టర్ శ్వేతాప్రియాంక దగ్గరే వైద్య పరీక్షలు చేయించుకుంటుంది.
డెలివరీ కోసం వచ్చిన గర్భిణీ జ్యోతికి శుక్రవారం ఉదయం ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పడంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.ఉదయం వచ్చిన ఆమెకు కనీసం వైద్య పరీక్షలు సైతం చేయకుండా,సాయంత్రం సుమారు 3.00 గంటల సమయంలో వచ్చి కడుపులోని బిడ్డ హార్ట్ బీట్ సరిగ్గా లేదని,హుటాహుటిన ఆపరేషన్ చేశారు.అప్పటికే పరిస్థితి విషమించడంతో గర్భంలోని శిశువు మృతి చెందింది.
ఉదయం తీసుకొచ్చిన గర్భిణికి కనీసం డాక్టర్ శ్వేత ప్రియాంక వైద్య పరీక్షలు చేయకుండా,నిర్లక్ష్యంగా ఆసుపత్రి సిబ్బంది చేత వైద్య పరీక్షలు చేయించడంతోనే పండంటి మగబిడ్డ మృత్యువాత పడ్డాడని ఆరోపిస్తూ తమకు తగిన న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు.ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదని డాక్టర్ శ్వేత ప్రియాంక చెబుతున్నారు.
పేషెంట్ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదు.ఉదయం నుంచి ఆసుపత్రి సిబ్బంది పేషంట్ ను పర్యవేక్షిస్తున్నారు.
బిడ్డ గుండెచప్పుడు తక్కువ ఉండడాన్ని గ్రహించి తల్లి ప్రాణానికి ప్రమాదమని భావించి ఆపరేషన్ చేయడం జరిగింది.గర్భస్థ శిశువు గుండె చప్పుడు తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి.







