విలీనం!విమోచనం!!విద్రోహం!!!సమైక్యత.?

హైదరాబాద్:తెలంగాణలో ప్రస్తుతం సెప్టెంబర్‌ 17 చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.హైదరాబాద్‌ సంస్థానం నిజాం నుంచి దేశంలో అంతర్భాగమైన తేదీకి ఒక్కో పార్టీ ఒక్కో భాష్యం చెబుతూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

 Merger!redemption!!treason!!!integration.?-TeluguStop.com

సెప్టెంబర్‌ 17పై ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇన్నేళ్లుగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదు.

ఈసారి మాత్రం పోటాపోటీ కార్యక్రమాలకు దిగాయి.నిజాం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేసింది కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వమని ఆ పార్టీ నేతలు చెబుతుంటే,నిజాం అరాచకాల నుంచి సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ విమోచనం కలిగించారని బీజేపీ పేర్కొంటోంది.

విలీనం,విమోచనం కాకుండా టీఆర్‌ఎస్‌ దీన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించింది.ఎంఐఎం కూడా సమైక్యతా దినోత్సవంగా పరిగణించాలని కోరింది.

వామపక్షాలు దీన్ని విద్రోహంగా భావిస్తున్నాయి.ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణలో ఆయా పార్టీలు నిర్వహించే కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.

విమోచన దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు.హైదరాబాద్‌ సంస్థానంలో భాగంగా ఉన్న కర్నాటక, మహారాష్ట్రలోని ప్రాంతాలు కూడా విమోచనం పొందినందున ఆయా రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొంటున్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తోంది.ఉదయం పబ్లిక్‌ గార్డెన్స్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్డు నుంచి ఎన్టీఆర్‌ గ్రౌండ్స్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తారు.అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో గాంధీ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ తల్లి నమూనాను కూడా ఆవిష్కరించనున్నారు.వామపక్ష పార్టీలు ర్యాలీలు నిర్వహించనున్నాయి.ఎంఐఎం ఆధ్వర్యంలో పాతబస్తీలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.సెప్టెంబర్17 విలీనం అయినా,విమోచనం అయినా, విద్రోహం అయినా,సమైక్యత అయినా ప్రస్తుతం దాని వలన తెలంగాణ ప్రజలకు జరిగే మేలేమిటో అర్థం కావడం లేదు.సెంటిమెంట్ ను ఆయింట్మెంట్ గా పూసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి తప్ప ఇంకేమైనా దీనితో జరిగే లాభం ఏమైనా ఉందా? పైగా దీని పేరుతో జరిగే కార్యక్రమాలకు ప్రజా ధనం వృధా కావడంతో పాటు అక్కడక్కడా ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా కనిపిస్తోంది.తెలంగాణకు నేడు స్వాతంత్య్రం వచ్చింది గౌరవంగా జాతీయ జెండాను ఎగురవేసి,అమరులకు నివాళులర్పించి,ఆ మహనీయుల త్యాగాలను భవిష్యత్ తరాలకు అందిస్తే సరిపోతుంది కదా? మరి సెప్టెంబర్ 17 ఇన్నాళ్లు లేని రచ్చకు ఇప్పుడెందుకు తెరలేపారు? ఇదే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది.వాస్తవానికి సెప్టెంబర్ 17 తో ఇప్పుడు విమోచనం అంటున్న బీజేపీకి,సమైక్యత అంటున్న టీఆర్ఎస్ కి ఎలాంటి సంబంధం లేదు.కానీ,ఆ రెండు పార్టీలే దానిని భుజాలపైకి ఎత్తుకొని రాద్ధాంతం చేయడం గమనార్హం.

ఇక విలీనం అంటున్న కాంగ్రేస్ కు కొద్దో గొప్పో ఆ హక్కు ఉంది.ఎందుకంటే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి.

అదే కాంగ్రేస్ పార్టీ వారసులుగానే వీరు వస్తున్నారు కాబట్టి.కానీ,వారు మాత్రం నామ మాత్రంగా వేడుకలు చేస్తున్నారు.

ఇక విద్రోహం అంటున్న వామపక్ష పార్టీలకు కూడా దానికై మాట్లాడే పూర్తి హక్కుందని చెప్పుకోవచ్చు.దానికి కూడా కారణం లేకపోలేదు.

ఆనాడు నిజం నిరంకుశ పాలనకు,స్థానికంగా రజాకార్లు,దేశ్ ముఖ్,జాగీర్దార్లు సాగించిన అరాచకాలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది,అందులో అశువులు బాసింది నాటి కమ్యూనిస్టులే.ఆనాడు నిజం సైన్యాల మీద ఒకవైపు,భారత మిలిటరీ సైన్యాల మీద మరోవైపు పోరాటం చేసిన చరిత్ర ఆనాటి కమ్యూనిస్టులదే.

హైదరాబాద్ సంస్థానాన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హస్తగతం చేసుకుంటుందని భావించిన భారత ప్రభుత్వం నిజాం నవాబుతో రహస్య ఒప్పందం చేసుకొని విలీనం పేరుతో వేల మంది సాయుధ పోరాట వీరులను మట్టుబెట్టి,భారత్ లో విలీనం చేశామని ప్రకటించుకుంది.దీన్ని బట్టి సెప్టెంబర్ 17 గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయాల్సింది కాంగ్రేస్, కమ్యూనిస్టులు.

కానీ,అసలు దానితో ఎలాంటి సంబంధం లేని బీజేపీ,టీఆర్ఎస్ ఎందుకు విమోచన, సమైక్యతా రాగాలు ఆలపిస్తున్నాయో తెలంగాణ ప్రజలు,ముఖ్యంగా విద్యావంతులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube