పాత మైనింగ్ పాలసీని కొనసాగించి గ్రానైట్ పరిశ్రమను ఆదుకోండి.సమస్యల పరిష్కారంపై మంత్రులకు రాష్ట్ర చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమల సంఘం ప్రతినిధుల వినతి.
సమస్యల పరిష్కారంకు స్పష్టమైన హామీని ఇచ్చిన మంత్రులు.రాష్ట్రంలో గ్రానైట్, గ్రానైట్ అనుబంధ చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ఇతర సమస్యలపై రాష్ట్ర చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమల సంఘం ప్రతినిధుల రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, గంగుల కమలాకర్ గారు, ఎర్రబెల్లి దయాకర్ రావులను మంగళవారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
కొత్త మైనింగ్ పాలసీ తట్టుకోలేనంత ఆర్దిక ఒత్తిడిలో గ్రానైట్ క్వారీలు ఉన్నాయని సీ ఫారమ్ లు ఇవ్వని వాటిపై విధించిన పన్ను రద్దు చేయాలని కోరారు.
గ్రానైట్ పరిశ్రమలకు స్లాబ్ విధానాన్ని అమలు చేసి, నాణ్యమైన విద్యుత్ ను నిరంతరం అందచేయడం ద్వారా గ్రానైట్ పరిశ్రమలను గత 8 సంవత్సరాల నుండి నిలబెట్టుతున్న సీఎం కేసీఆర్ కు అందుకు కృషి చేసిన మంత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే నూతనంగా ప్రవేశపెట్టిన మైనింగ్ పాలసీ ద్వారా అనూహ్యంగా పెంచిన రుసుములను మరియు కొత్తగా విధిస్తున్న ఫీజుల వల్ల గ్రానైట్ క్వారీలకు ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నవని ఒక వైవు ముడిసరుకులు ఎగుమతి ముఖ్యంగా చైనాకు తగ్గిపోవడం; మరోవైపు కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటం వల్ల స్వదేశీ మార్కెట్ కూడ పూర్తిగా పడిపోయినదని విన్నవించారు.
ఈ పరిస్థితులలో నూతన పాలసీని తట్టుకొని క్వారీలు నిలబడటం దాదాపు అసాధ్యమని క్వారీలు ఆగితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని వేల పరిశ్రమలు అనివార్య పరిస్థితుల్లో మూతపడే ప్రమాదం ఉన్నదని అవేదన వ్యక్తం చేశారు.
కావున పాత మైనింగ్ పాలసీని కొనసాగించాలని ప్రభుత్వం రైస్ మిల్లుల వారికి సీ ఫారమ్ ల రద్దు చేసిన విధంగా గ్రానైట్ పరిశ్రమలకు సైతం సీ ఫారమ్ లను రద్దు చేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించి గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాలని విన్నవించారు.
సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు.







