తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్ ,బిజెపి , కాంగ్రెస్ లు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు వెళుతున్నాయి.ఇక్కడ గెలవడం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు బాటలు వేసుకోవచ్చనే లక్ష్యంతో అన్ని పార్టీలు ప్రధానంగా కష్టపడుతుండగా, కొత్తగా తెలంగాణలో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల చూపు ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం పైన పడింది.
వైయఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన తరువాత పాదయాత్రలు, ప్రజా సమస్యలు , నిరుద్యోగ దీక్షలు అంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ బలం పెంచుకునే ప్రయత్నం షర్మిల చేస్తున్న, ఆ పార్టీలో చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.అయితే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి తెలంగాణలో అనేక ఉప ఎన్నికలు జరిగినా, షర్మిల తమ పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టలేదు . ఇదే రకంగా ముందుకు వెళితే ప్రజలు తమ పార్టీని పట్టించుకోరనే విషయాన్ని గుర్తించిన షర్మిల మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం .అన్ని ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి టికెట్లు ఇస్తుండడంతో తమ పార్టీ తరఫున బీసీ అభ్యర్థిని పోటీకి దించాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు సమాచారం .ఈ మేరకు అంతర్గతంగా ఈ నియోజకవర్గంలో సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది.గతంలో షర్మిల మునుగోడు నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర నిర్వహించారు.
అప్పట్లో ఆమె పాదయాత్రకు స్పందన బాగానే వచ్చింది.దీంతో తమ పార్టీ పోటీ చేస్తే ఫలితం ఉంటుందనే లెక్కల్లో షర్మిల ఉన్నారట.
అయితే ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవడంతో షర్మిల దానిని ఏ విధంగా ఎదుర్కొంటారనేది తేలాల్సి ఉంది.
ఇక మునుగోడు నియోజకవర్గంలో సామాజిక వర్గాల లెక్కల ప్రకారం చూసుకుంటే , మిగతా సామాజిక వర్గాల కంటే రెడ్డి సామాజిక వర్గం బలం తక్కువ.అందుకే ఇక్కడ బీసీ అభ్యర్థి ని పోటికి దింపేందుకు షర్మిల ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో షర్మిల పార్టీని ఎంతవరకు ఆదరిస్తారు అనేది అనుమానమే.
క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఇంకా బలం పెంచుకోకపోవడం వంటివన్నీ ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు.