విశాఖపట్నం ముడసర్లోవ స్థల పరిరక్షణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు.మంగళవారం ఆమె జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలసి ముడసర్లోవ ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించుటకు సిద్ధం చేసిన ప్రాజెక్టు నివేదికను పరిశీలించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ముడసర్లోవ ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సుమారు తొమ్మిది కోట్ల రూపాయలతో 7 కిలోమీటర్లు రక్షణ గోడ నిర్మించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని త్వరలోనే శంకుస్థాపన కూడా చేస్తామని తెలిపారు.అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ పార్కుగా అభివృద్ధి చేయుటకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు.
ఈ పార్కులో బయో డైవర్సిటీ పార్కు, మియావాకి పార్కు, హెర్బల్ పార్కు, బటర్ఫ్లై పార్క్, బొటానికల్ పార్క్, బర్డ్స్ పార్కు మొదలైనవి అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.ముడసర్లోవ మొత్తం ఆయకట్టు 836.38 ఎకరాలని దీనిలో బి ఆర్ టి ఎస్ రహదారికి 97 ఎకరాలు, గోల్ఫ్ క్లబ్ కు 112 ఎకరాలు, అటవీ శాఖ, పోర్టు ట్రస్ట్ కు, 120 ఎకరాలు, రైల్వే కు 52 ఎకరాలు, విద్యుత్తు, ఎస్సీ ఎస్టీ కాలనీలకు 120 ఎకరాలు ఫోను మిగిలిన 286 ఎకరాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.విశాఖ నగరంలో ఖాళీ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించేందుకు జగనన్న ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని తెలిపారు.
అనంతరం 11 వార్డులో పినాకిలి హాస్పిటల్ ప్రక్కన సుమారుగా రెండు ఎకరాలు ఖాళీగా బహిరంగ ప్రదేశం సర్వే చేపట్టి చుట్టూ రక్షణ గోడ నిర్మించి రెండు ప్రధాన గేట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహన ఇంజనీర్ ప్రాజెక్ట్స్ వి వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిలాని దిలీప్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సిబ్బంది పాల్గొన్నారు.







