95 ఏళ్ల వయస్సులో చాలామంది మంచానికే పరిమితం అవుతారు కానీ శాంతమ్మ అనే వృద్ధురాలు పిల్లలకు పాఠాలు చెబుతూ అందరిచేత వావ్ అనిపిస్తున్నారు.మామూలుగా వయసులో ఉన్నప్పుడే పాఠాలు చెప్పడం చాలా కష్టం.
అలాంటిది 95 ఏళ్ల వయసులో ఈమె ఫిజిక్స్ పాఠాలు బోధిస్తున్నారు.విజయనగరం సెంచూరియన్ యునివర్సీటీలో ఎవరి సాయం లేకుండా శాంతమ్మ నేరుగా క్లాస్ రూమ్‌లలోకి వెళ్తూ పాఠాలు చెబుతున్నారు.
ఈమె మెడికల్ ఫిజిక్స్, రేడియాలజీ, అనస్థీషియా వంటి క్లిష్టమైన సబ్జెక్ట్ చాలా ఈజీగా చెబుతూ విద్యార్థుల మనసును దోచేస్తున్నారు.
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంకి చెందిన శాంతమ్మ 1929, మార్చి 8న పుట్టారు.
ఆమె ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ కూడా సాధించారు.ఆంధ్రా యూనివర్సిటీలో మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీలో డీఎస్సీ కంప్లీట్ చేశారు.
అనంతరం 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో ఫిజిక్స్ లెక్చరర్‌గా జాయిన్ అయ్యారు.ఆ తర్వాత ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్ వంటి ఉన్నత హోదాలలో పని చేశారు.60 ఏళ్ల వచ్చాక ఆమె 1989లో రిటైర్ అయ్యారు.ఆ తర్వాత కూడా పాఠాలు చెప్పాలనే ఆసక్తి ఆమెలో తగ్గలేదు.
ఆ ఆసక్తితోనే ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా జాయిన్ అయ్యి ఆరేళ్లు పాటు టీచింగ్ చేశారు.
ఇప్పుడు శాంతమ్మ ప్రతి రోజూ వేకువ జామున 4 గంటలకే నిద్రలేస్తారు.

ఆపై విశాఖకి బయలుదేరి విజయనగరంలోని సెంచూరియన్ యూనివర్శిటీకి వస్తారు.అక్కడ డైలీ కనీసం ఆరు తరగతులకు వెళ్ళి పాఠాలు చెబుతారు.జోక్ ఏంటంటే, ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, ఇప్పటి సెంచూరియన్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ జీఎస్‌ఎన్ రాజు శాంతమ్మకి స్టూడెంట్ అవుతారు.ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా 95 ఏళ్ల తర్వాత పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ లేడు.
అందుకే ఆమె పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కి పంపించాలని జీఎస్‌ఎన్ రాజు అనుకుంటున్నారు.అదే జరిగితే త్వరలో ఈమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టే అవకాశం ఉంది.







