ఏఐసీసీ అదేశానుసరం టీపీసీసీ పిలుపు మేరకు 5న జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు.సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏఐసీసీసీ , టీపీసీసీ పిలుపు మేరకు ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గ కేంద్రాల స్థాయిలో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, అగ్నిపత్ అంశం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వంటి అంశాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని అన్నారు.
అదేవిధంగా 75 ఏండ్ల స్వాతంత్ర వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆగష్టు 9వ తేదీ నుంచి 15 వరకూ జిల్లాలో 75 కిలోమీటర్లు ఆజాదికా గౌరవ్ యాత్ర పేరుతో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు.
ఈ పాదయాత్ర కూసుమంచి నుంచి పెనుబల్లి వరకూ 75 కిలోమీటర్ల, 75మంది కార్యకర్తలకు తగ్గకుండా భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు.నాటి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో 9వ తేదీన నిర్వహించనున్న పాదయాత్ర కు కాంగ్రెస్ నాయకులంతా కదిలి రావాలని ఆయన కోరారు.
అటు కేంద్రం ఇటు రాష్ట్రం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కాలయాపన చేస్తున్నాయని మండిపడ్డారు.
అకాల వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే నష్టానివారణ చర్యలు చేపట్టకుండా ముఖ్యమంత్రి ఢీల్లీలో షికార్లు చేసివచ్చారని ఎద్దేవా చేశారు.
ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం చిన్న పిల్లలనూ సైతం వదలడం లేదని అన్నారు.దేశవ్యాప్త నిరసనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, జిల్లా ఓబీసీ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు మల్లెల అజయ్, జెర్రి పోతుల అంజనీకుమార్, నెలకొండపల్లి నియోజకవర్గ సేవాదల్ కన్వీనర్ బచ్చలకూర నాగరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.







