ప్రపంచ చెస్ పండుగకు రంగం సిద్ధమైంది.44వ చెస్ ఒలంపియాడ్ పోటీలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు… ప్రారంభోత్సవానికి ముందు స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి.
దేశంలో తొలిసారిగా జరుగుతున్న అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీల ఏర్పాట్లకు తమిళనాడు ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది.‘తమిళతంబి’ పేరుతో గుర్రం ముఖ రూపంలో ఓ చిహ్నాన్ని అందుకోసం ప్రత్యేకంగా రూపొందించి నగరం నలుమూలలా ఏర్పాటు చేసింది.మంత్రులు, ఐఏఎస్ అధికారులతో పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసింది.
చెన్నై సమీపంలోని మహాబలిపురంలో పోటీల నిర్వహణకు ఆడిటోరియం, క్రీడాకారులకు స్టార్ హోటళ్లలో బసకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోదీ గురువారం చెన్నైకు చేరుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర మంత్రులు, స్వదేశీ, విదేశీ చెస్ క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.క్రీడా ప్రాంగణం పరిసరాల్లో ఏడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు…

29వ తేదీ నుంచి ఆగస్టు 10వరకు చెస్‌పోటీలు జరుగుతాయి.వీటిలో పాల్గొనేందుకు ఒక వెయ్యి 45 మంది క్రీడాకారులు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు.భారత్‌తోపాటూ అమెరికా, ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా , మలేషియా, ఒమన్, డెన్మార్క్ తదితర 186 దేశాల నుంచి ఒక వెయ్యి 736 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారు.937మంది ఓపెన్ సెక్షన్ లో, 799మంది మహిళల సెక్షన్ లో పాల్గొననున్నారు.

గత నెల 19వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించిన చెస్ ఒలంపియాడ్ టార్చ్ రిలే రన్ 39 రోజుల్లో 75 నగరాలను చుట్టివచ్చింది.బుధవారం మహాబలిపురానికి చేరుకుంది.తమిళనాడు మంత్రులు ఆ టార్చ్‌ను అందుకున్నా రు.







