పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యతో భారత్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.ఇది తమ పనేనంటూ కెనడాలో వున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించడంతో.
కెనడాలోని పంజాబీ గ్యాంగ్‌లపై ఒక్కసారిగా చర్చ మొదలైంది.ఎన్నో పంజాబీ ముఠాలు కెనడాను అడ్డాగా చేసుకుని భారత్‌లో నేర సామ్రాజ్యాలను విస్తరిస్తున్నాయి.
కిరాయి హత్యలు, డ్రగ్స్, ఆక్రమ ఆయుధాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి.ఈ నేపథ్యంలో కెనడాలో వుంటూ పంజాబ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్‌స్టర్‌లను పట్టుకునేందుకు తమకు సహకరించాలంటూ ఇటీవల కెనడా ప్రభుత్వాన్ని కోరారు సీఎం భగవంత్ మాన్.
ఇప్పటికే పలువురు గ్యాంగ్‌స్టర్‌లపై పంజాబ్ ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో పాటు అప్పగింతపై కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే వున్నారు.వీరిలో లఖ్‌బీర్ సింగ్ లాండా, అర్ష్ ధల్లా, గోల్డీ బ్రార్, రామన్ జడ్జి, రింకు రంధావా, బాబా డల్లా, సుఖా దునేకే ఇలా పేరు మోసిన గ్యాంగ్‌స్టర్లంతా కెనడాలోనే వున్నారు.
అయితే అసలు పంజాబీ గ్యాంగ్‌స్టర్లు కెనడాను అడ్డాగా చేసుకోవడానికి కారణమేంటనేది ఒకసారి పరిశీలిస్తే.పోలీసులు చెబుతున్న దానిని బట్టి నేర, స్తుల అప్పగింత ప్రక్రియకు కెనడా ప్రభుత్వం నుంచి భారత్‌కు సరైన సహకారం లేకపోవడమేనని తెలుస్తోంది.
అయితే ఈ గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు కారణంగా కెనడాలోనూ శాంతి భద్రతల సమస్యలు ఏర్పడుతున్నాయి.ఇటీవల వాంకోవర్‌లో జరిగిన గ్యాంగ్‌వార్‌లో గ్యాంగ్‌స్టర్ మణీందర్ ధాలివాల్, అతని స్నేహితుడు సతీందర్ గిల్‌లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
29 ఏళ్ల మణీందర్ ధాలివాల్ ‘బ్రదర్స్ కీపర్స్’ ముఠా సభ్యుడు.ఇటీవలి కాలంలో వాంకోవర్‌లో జరిగిన గ్యాంగ్‌వార్స్, తుపాకీ కాల్పుల ఘటనల్లో ఇతని ప్రమేయం వున్నట్లుగా కెనడా పోలీసులు చెబుతున్నారు.
ఇక సతీందర్ గిల్ విషయానికి వస్తే ఇతను ధాలివాల్ స్నేహితుడు.అతనికి ఏ గ్యాంగ్‌లతోనూ సంబంధాలు లేవు.కాంక్రీట్ ట్రక్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గిల్.తన పుట్టినరోజును జరుపుకోవడానికి విస్లర్‌కు వచ్చాడు.
వీరి హత్యలకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

లాండా విషయానికి వస్తే.అతనిపై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ తరన్ తారన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.వ్యాపారులు, కాలనీవాసులు, డాక్టర్లను బెదిరించి ఇతను వసూళ్లకు పాల్పడేవాడని పోలీసులు చెబుతున్నారు.
గతేడాది జూలైలో అమృత్‌సర్ రూరల్ పోలీసులు, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ యూనిట్ (ఓసీసీయూ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో పట్టుబడ్డ దయాసింగ్, ప్రీత్ సెఖోన్‌లను విచారించిన సమయంలో లాండా పేరు కూడా వినిపించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తరన్ తారన్ జిల్లాలోని చంబా ఖుర్ద్ గ్రామానికి చెందిన లాండా అనుచరుడు జర్మన్‌జిత్ సింగ్ అలియాస్ నిక్కా ఖదురియాను చమియారీ గ్రామంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
విచారణ సందర్భంగా లాండా ఆదేశాల మేరకు ప్రీత్ సెఖోన్ అంతర్జాతీయ స్థాయి హవాలా ఆపరేటర్‌కు చెందిన బ్యాంక్ ఖాతాలో 25 మంది వ్యక్తుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల విషయం వెలుగుచూసింది.

ఈ నేపథ్యంలో లాండా సహా మరో గ్యాంగ్‌స్టర్ అర్ష్ ధల్లాపైనా రెడ్‌కార్నర్ నోటీసుతో పాటు అప్పగింతకు సంబంధించి ప్రక్రియను వేగవంతం చేశారు పోలీసులు.అలాగే ఈ విషయంలో సహకరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో తమ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారని తరన్ తారన్ జిల్లా పోలీసులు చెబుతున్నారు.అటు సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తును కూడా పంజాబ్ పోలీసులు ముమ్మరం చేశారు.
దీనిలో భాగంగా ఈ హత్యకు సూత్రధారి , కెనడియన్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను భారత్‌కు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలయ్యాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ స్పష్టం చేశారు.ఇతని అసలు పేరు సతీందర్ సింగ్.
పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ ప్రాంతానికి చెందిన వాడు.కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో బిష్ణోయ్ తరపున గోల్డీ బ్రార్ వసూళ్ల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.







