టిడిపి అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్లినా వైసీపీ ప్రభుత్వం పై జనాల్లో వ్యతిరేకత పెరిగిందని, 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓటమి చెందుతుందని , రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని పదేపదే చెబుతున్నారు.వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా పనిచేస్తుందని, శ్రీలంక పరిస్థితితులే ఏపీలో రాబోతున్నాయని జనాలు వైసిపి పై తిరుగుబాటు చేయాలని , తరిమి తరిమి కొట్టాలని పదేపదే బాబు ప్రకటనలు ఇస్తున్నారు.
వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలోనూ ఈ తరహా వ్యాఖ్యలే చేస్తున్నారు.అయితే నిజంగా వైసిపి ప్రభుత్వం పైన, పార్టీ పైన ప్రజల్లో అసంతృప్తి ఉంటే దానికి 2024 ఎన్నికల్లో తగిన విధంగా తీర్పు చెబుతారు.
ప్రస్తుతం వైసీపీపై బాబు చెబుతున్నట్లుగా వ్యతిరేకత పెరుగుతుంటే, దానిని టిడిపి తనకు అనుకూలంగా మార్చుకుని పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకోవడం వైసీపీలోని అసంతృప్త నాయకులను పార్టీలో చేర్చుకోవడం వంటి విషయాలపై దృష్టి పెట్టాలి.అదే సమయంలో పార్టీని మరింతగా బలోపేతం చేయాల్సి ఉంటుంది .కానీ ప్రస్తుతం టిడిపిలో ఆ తరహా పరిస్థితులు లేవనేది ఆ పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు.ప్రస్తుతం టిడిపిలోనూ అనేక ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి.
చాలా నియోజకవర్గాలకు ఇన్చార్జీలు లేరు.
ఉన్నచోట పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు, ఆర్థిక భారం మోసేందుకు నాయకులు ఎవరు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.

దీనికి కారణం చంద్రబాబు దృష్టిలో పడేందుకు , భారీగా సొమ్ములు ఖర్చుపెట్టినా ఎన్నికల సమయంలో లోకేష్ కీలకంగా వ్యవహరిస్తే తమకు టికెట్ దక్కడం అనుమానమే అని చాలామంది నాయకులు భావిస్తున్నారు.అదీ కాకుండా గత మూడు సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారికి టిక్కెట్ ఇచ్చేదే లేదని చెబుతుండడంతో పాటు , పార్టీలో యువతకి టికెట్లు ఎక్కువగా కేటాయిస్తామని ప్రకటించడంతో సీనియర్ నాయకులు చాలామంది సైలెంట్ అయిపోయారు.

దీంతో యువ నాయకులు పార్టీ తరఫున యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న వారి వెంట వెళ్లేందుకు క్యాడర్ సిద్ధపడకపోవడం వంటివి ఇబ్బందికరంగా మారాయి.ప్రస్తుతం టిడిపి ఎంపీ కేసినే నాని పార్టీ పై తిరుగుబావుటా ఎగరవేసినట్లుగా వ్యవహరిస్తున్నారు.అయినా బాబు ఈ తరహా వ్యవహారాలు వేటినీ పట్టించుకోవడం లేదు.పార్టీలో అంతర్గతంగా నెలకొన్న ఇబ్బందులను పట్టించుకోకుండా పూర్తిగా వైసిపి పై విమర్శలు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో, టీడీపీ ఎన్నికల నాటికి వైసీపీ ని ఎదుర్కునే స్థాయిలో బలపడుతుందా అనేది అనుమానంగానే మారింది.







