తెలంగాణ కాంగ్రెస్ లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాలనేది సర్వసాధారణ అంశాలుగానే మారిపోయాయి.తెలంగాణలో పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనే విషయంపై కంటే, పార్టీలో తామే సీనియర్ నాయకులమని, ఎవరు ఏం చేసినా తమకు చెప్పే చేయాలన్న ధోరణి ఎక్కువగా కనిపిస్తూ ఉండడం వంటివి ఆ పార్టీ ఎదుగుదలకు ఇబ్బందికరంగా మారాయి.
గతంతో పోలిస్తే కాంగ్రెస్ లోకి చేరికలు ఎక్కువగా మొదలయ్యాయి.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ చేరికలపై ఎక్కువగా దృష్టి సారించారు. అయితే తమకు చెప్పకుండా తమ జిల్లాల్లో ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు , అధిష్టానం పెద్దలకు దీనిపై ఫిర్యాదు చేశారు.అయినా రేవంత్ అవేమీ పట్టించుకోకుండా, చేరికల జోరు మరింతగా పెంచడంతో వరుస వరుసగా సీనియర్ నాయకులంతా రేవంత్ తీరు పై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూనే వస్తున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చేరికల పై సమాచారం తనకు ఇవ్వడం లేదని పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఆయనతో పాటు దామోదర రాజనర్సింహ సైతం అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు.

హుస్నాబాద్ లో ప్రవీణ్ రెడ్డి చేరికపై కొంతమంది అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.మెట్ పల్లి జెడ్పిటిసి చేరికపై మధుయాష్టికి , ఖమ్మం జిల్లామెట్ పల్లి చేరికలపై భట్టి విక్రమార్కకు, దేవరకొండ చేరికలపై ఉత్తంకుమార్ రెడ్డికి, మెదక్ జిల్లా చేరికలపై దామోదర్ రాజనర్సింహా కి సమాచారం ఇవ్వడం లేదు అని వారంతా తీవ్ర అసంతృప్తితో అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు.ఈ చేరికలపై కనీసం జిల్లా నేతలకు సమాచారం ఇవ్వకపోతే ఎలా అంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.అయితే వరుస వరుసగా ఇదే రకమైన ఫిర్యాదులు అందుతూ ఉండడంతో , కాంగ్రెస్ లో చేరికల పై కీలక సూచనలు చేసింది.
ఇకపై పార్టీలో ఎవరు చేరబోతున్నా, 48 గంటలు ముందుగా ఏఐసిసి కార్యదర్శి బోసు రాజుకు సమాచారం ఇవ్వాలని, ఆయనే ఆయా జిల్లా నాయకులు, సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇస్తారని అధిష్టానం పెద్దలు సూచించారు.అయితే ఈ చేరికల సమాచారం ముందుగా లీక్ అయితే వాటికి బ్రేకులు పడే అవకాశం ఉందని రేవంత్ అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో అధిష్టానం పట్టించుకుంటారా లేక ఇదే వైఖరితో భారీగా వలసలను కాంగ్రెస్ లోకి ప్రోత్సహించి అధిష్టానం వద్ద తన బలం పెంచుకోవడంతో పాటు, తాను ఎందుకు చేరికల విషయంలో ఈ విధంగా చేయాల్సి వచ్చిందనేది వివరణ ఇస్తారా అనేది తేడాల్సి ఉంది.







